Boat collision : ఆఫ్రికా దేశంలోని కాంగో (DRC) లో ఘోర ప్రమాదం (Accident) జరిగింది. కాంగో నది (Congo River) లో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో 30 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఒక పడవ ఉబాంగి (Ubangi) నుంచి దేశ రాజధాని కిన్షాషా (Kinshasha) కు, మరొకటి కిన్షాషా నుంచి లూకోలెలా (Lukolela) కు వెళ్తుండగా.. ఈ దుర్ఘటన (Boat Collision) చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రమాదానికిగల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులతో నిండిన బోట్లు ఢీకొనడంతో నదిలో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారితోపాటు పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. నదిలో ప్రవాహం వేగంగా ఉండటంతో గల్లంతు అయిన వారి ఆచూకీ కనుగొనడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ రెండు మోటారు పడవలు ఎందుకు ఢీకొన్నాయనేదానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ఓవర్లోడింగ్, సిబ్బంది నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాలవల్ల ఈ ప్రమాదం జరిగిందా.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాంగో నదిలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్ల ఇలాంటి ప్రాణాంతక పడవ ప్రమాదాలు తరచూ పునరావృతం అవుతున్నాయి.