చుంచుపల్లి, అక్టోబర్ 05 : పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ పంచాయతీకి చెందిన తాళ్లూరి సూర్యారావు (52), సుద్దాల రవి ఆదివారం రాత్రి రాంపురంలో మేసన్ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుడగం శంకర్ బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంతో వెనుక నుండి వారిని ఢీకొట్టాడు. దీంతో సూర్యారావు, రవి రోడ్డుపై పడిపోయారు.
ఈ ప్రమాదంలో సూర్యారావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన సుద్దాల రవి ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సూర్యారావుకి ముగ్గురు పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, భార్య ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు దూరం అవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై టూ టౌన్ ఎస్ఐ జీవన్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.