వెల్దండ /నారాయణపేట/ అచ్చంపేట / ఊట్కూర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ ( Veldanda) మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో వ్రతాలు, నోములు,అభిషేక పూజలు, యజ్ఞహోమాలు చేశారు. కొట్ర తండాలోని హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నారాయణపేట మండలంలో..
పేట మండల పరిధిలోని జాజాపూర్, అప్పి రెడ్డిపల్లి, లక్ష్మీపూర్, తిరుమలాపూర్తో పాటు ఇతర గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాజాపూర్ గ్రామంలోని జెట్టి హనుమాన్ మందిర్ వద్ద ధ్వజారోహణం, అభిషేకం, ప్రత్యేక పూజలు , హోమం నిర్వహించారు. కొత్త కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అచ్చంపేట పట్టణంలో..
అచ్చంపేట పట్టణంలోని జూబ్లీ నగర్ అయ్యప్ప హనుమాన్ ఆలయంలో శనివారం ఘనంగా హనుమాన్ జయంతిని పలు ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి శోభాయాత్రను పురవీధుల గుండా నిర్వహించారు. ధార్మిక సంఘాల నాయకులు మండికారి బాలాజీ, అంజనీ మాత మహిళా మండలి సభ్యులుపాల్గొన్నారు.
అంజన్న రథోత్సవంలో పాల్గొన్న నాయకులు
ఊట్కూర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పగిడిమర్రి గ్రామంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలను సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. బంతిపూలతో ఆకర్షణీయంగా ముస్తాబు చేసిన రథంలో స్వామివారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మారుతి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పురవీధుల్లోకి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (MLA Vakiti Srihari ) , మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బసవరాజ్ గౌడ్, మురళీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నారాయణ గౌడ్, విష్ణు మూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, అశోక్ పాల్గొన్నారు.