ఊట్కూర్, జూన్ 15 : ఒకప్పుడు నిత్యం జలకళతో కళకళలాడే కృష్ణా, భీమా నదులు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. జీవనదులుగా పేరొందిన ఈ రెండు నదుల ప్రవాహం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికే పరిమితమైనట్లు కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటైన కృష్ణానది పశ్చిమ కనుమల్లో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రవహిస్తోంది.
కృష్ణానదికి ప్రధాన ఉపనది భీమా మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై ప్రభావం చూపుతూ కృష్ణానదిలో కలుస్తుంది. కర్ణాటకలోని రాయిచూర్ జిల్లాలో నిర్మించిన గుర్జాపూర్ బ్యారేజీ, భీమా నదిపై నిర్మించిన గూడూరు బ్యారేజీలు నిండుకుండలను తలపిస్తుండగా, దిగువన తెలంగాణ ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాలు రాళ్లు, రప్పలు, ఇసుక మేటలతో ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
జిల్లాలోని కృష్ణ మండలం భీమా నదిపై ఏర్పాటు చేసిన కుసుమూర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, వాసునగర్ కృష్ణానది పరివాహకం అంచున నిర్మించిన లక్ష్మీవేంకటేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌తోపాటు మాగనూర్ మండలం ముడుమాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ప్రసుత్తం తగిన నీరు అందడం లేదు. కృష్ణ, భీమా జీవనదుల ద్వారా నీటి ప్రవాహం లేక ప్రభుత్వం లిఫ్ట్‌లను మూత పెట్టింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. సాగునీరు అందితేనే పంటల సాగు సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు.

వట్టిపోయిన కృష్ణా-భీమా సంగమం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద కృష్ణా-భీమా నదులు కలిసే సంగమ ప్రాంతం ప్రసుత్తం నీటిజాడ లేక ఎడారిని తలపిస్తోంది. ఇసుక మేటలు, ఎండిన నదీగర్భం మాత్రమే కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నీటితో కళకళలాడిన ప్రాంతం నేడు వెలవెలబోతుండడం ఆ ప్రాంతం ప్రజలను కలచివేస్తోంది.
ఎగవ ప్రాంతం నుంచి నీటి విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించకపోవటంతోనే సాగునీరు, తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నదీ పరివాహక ప్రజలు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ కృష్ణా, భీమా నదుల్లో తెలంగాణ వాటా మేరకు నీటి విడుదల జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సాగు, తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చకముందే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు.