మహబూబ్‌నగర్ విద్యావిభాగం, డిసెంబర్ 14 : రాష్ట్రంలో 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) పరీక్షలు ని ర్వహించేందుకు జిల్లా యం త్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తం గా 54 పరీక్షా కేంద్రాలను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.51లక్షల మం దికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 20,554 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు ఉంటాయి.
బయోమెట్రిక్ తప్పనిసరి..
అభ్యర్థులు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు తెలిపారు.
నిమిషం నిబంధన అమలు..
జిల్లాలో మొత్తం 20,554 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 54 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. మొదటి సెషన్ కోసం ఉదయం 8:30నుంచి, మధ్యాహ్నం సెషన్‌కు 1:30గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గేట్లు నిర్దేశిత సమయానికి ఉదయం 9:30గంటలకు, మధ్యాహ్నం 2:30గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు రావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను, హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తప్పా మరే విధమైన వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పేజర్స్, టాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, గడియారం, గణిత టేబుల్, లాగ్ పట్టికలు, పర్స్, పరీక్ష ప్యాడ్, నోట్ బుక్స్ లేదా విడి పేపర్లు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్‌లు తీసుకురావద్దని సూచించారు.