ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించనున్న పరీక్షలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. సెంటర్ల వద్ద సిబ్బందిని వేడుకున్నా కూడా లోపలికి అనుమతించలేదు.
కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. పరీక్ష తీరును పర్యవేక్షించారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఎగ్జామ్కు కేవలం 50 శాతం మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం వనపర్తి జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్ 1కు 8,569 మందికి గానూ 4,408 మంది.., పేపర్-2కు 4,381 మంది హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 25 కేంద్రాల్లో 8,722 మందికి గానూ పేపర్-1కు 4,316, పేపర్-2కు 4,277 మంది వచ్చారు.
మహబూబ్నగర్ జిల్లాలో 20,584 మంది అభ్యర్థులకు 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1కు 10,380, పేపర్-2కు 10,314 మంది హాజరయ్యారు. నారాయణపేట జిల్లాలో 3,994 మందికిగానూ ఉదయం 2,052.., మధ్యాహ్నం 2,046 మంది పరీక్ష రాశారు. నాగర్కర్నూల్జిల్లాలోని 32 పరీక్షా కేంద్రాల్లో 9,731 మందికి గానూ పేపర్-1కు 4,772 మంది, పేపర్-2కు 4,755 మంది హాజరయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జేపీఎన్సీఈ వద్ద డీఐజీ చౌహన్, ఎస్పీ జానకి బందోబస్తును పరిశీలిస్తుండగా.. సమయం మించిపోతుండడంతో గర్భిణిని కారులో ఎక్కించుకొని హాల్ సమీపంలో వదిలిపెట్టారు.