గద్వాల, ఫిబ్రవరి 21 : జిల్లాలోని మార్కెట్ యార్డులో పల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రభుత్వం చేయూత లేక పెట్టుబడుల కోసం ఆసాముల వద్ద అప్పులు తెచ్చి పంటసాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతన్న మార్కెట్లో పంటను అమ్ముకుందామని తీసుకొస్తే అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా మా రింది. రైతులు పల్లిసాగు చేసే సమయంలో మార్కెట్లో పల్లి విత్తనాలు కొనుగోలు చేస్తే క్వింటా ధర రూ.12,500 నుంచి రూ.14,500 వరకు కొనుగోలు చేసి పల్లి పంటను సాగు చేస్తే పంట చేతి కొచ్చి మార్కెట్కు తీసుకొస్తే కనీసం ఆసామి వద్ద కొనుగోలు చేసిన పల్లికి సరిపోయే ధర కూడా రాకపోవడం తో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
రై తులు పల్లీలు కొనుగోలు చేసేటప్పుడు ఉన్న ధరలు పం ట పండించి మార్కెట్కు తీసుకొస్తే రావడం లేదని వా పోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్లపై నియంత్రణ ఉంచడంతోపాటు రైతుకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకొన్నది. దీనికి తో డు రైతులకు రైతుబంధు ద్వారా పెట్టుబ డి సాయం ఇవ్వడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకునే వా రు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్ర భుత్వంలో మార్కెట్లపై ని యంత్రణ లేకపోవడంతో మార్కెట్ యా ర్డు ల్లో కమీషన్ ఏజెంట్లదే ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది.
మార్కెట్లోని కమీషన్ ఏ జెంట్లు వింగ్ అయ్యి రైతులను నిలువునా ముంచుతున్నట్లు వాపోతున్నారు. పేరుకు మాత్రమే ఈ నామ్ మార్కెట్ గద్వాలలో కొనసాగుతున్నది. దీనికి తోడు రైతుభరోసా రెండు పంటలకు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో రైతులు పంటల సాగుకు అవస్థలు పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సీజన్లో 8,797 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఎప్పటిలాగా రైతులు సాగు చేసిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో భాగంగా పల్లీకి క్వింటాకు రూ.6,783 మద్ధతు ధర ప్రకటించింది.
ఆ ధర మార్కెట్లో రైతులకు దక్కాల్సి ఉండగా, కొనుగోలు సీజన్ ప్రారంభమైనా నాటినుంచి ఇప్పటి వరకు రోజుకు ఒకరిద్దరు రైతులకు మినహా ఏ రైతుకూ రూ.6 వేల ధర పలకడం లేదంటే పల్లి రైతుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పల్లి రైతులకు మద్దతు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనడానికి అచ్చంపేట, మహబూబ్నగర్ మార్కెట్లలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. చేతికొచ్చికొచ్చిన పంటను మార్కెట్లో అమ్మితే అప్పులే మిగులుతున్నాయి. గద్వాల వ్యవసాయ మా ర్కెట్లో కొన్ని రోజులుగా పల్లి రైతులకు అందుతున్న మద్దతు ధర వివరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఈ సీజన్లో రైతులకు ఏనాడూ పూర్తిస్థాయిలో మద్దతు ధర దక్కలేదని రైతులు వాపోతున్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు రైతులకు పూర్తి స్థాయి మద్దతు ధర రాలేదు. ఫిబ్రవరి 18 త ర్వాత మార్కెట్కు వేరుశనగ తక్కువగా రావడంతో రైతులకు కొంత మేర మద్దతు ధర లభించింది. సరాసరి ధరలు పోల్చితే రైతులకు ఏ నాడూ రూ.5వేలు దాటలేదు. జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవ రి 21వరకు ఏనాడూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధ ర రూ.6,783 లభించలేదు. 17వ తేదీ మాత్రం ముగ్గు రు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే విరక్తి కలుగుతోంది. మార్కెట్లో పల్లీలు కొనే సమయంలో క్వింటాకు రూ.12,500 నుంచి రూ.14వేల వరకు అమ్ముతున్నారు. సాగు చేసిన పల్లీలను మార్కెట్కు తీసుకొస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. రెండు ఎకరాల పల్లి పంట సాగు చేశా. 28సంచుల బుడ్డలు పండాయి. ఎకరాకు సుమారుగా పల్లి విత్తనాల కొనుగోలు, ఎరువులు, కూలీలు, గెడాలు అన్ని కలిపితే ఎకరాకు సుమారుగా రూ.50వేల పెట్టుబడి అయ్యింది. పంటను అమ్మితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు రెండు విడుతలుగా రైతు భరోసా కూడా రాకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది.
– సత్యారెడ్డి, రైతు, మార్లబీడు
ఆశ చావక రైతులు పంటలు సాగు చేస్తే చివరికి అప్పులే మిగులుతున్నాయి. రెండెకరాలు పల్లీ పంట సాగు చేయగా, 20సంచుల వేరుశనగ బుడ్డలు పండాయి. ఎకరాకు సుమారు రూ.40వేల పైనే పెట్టుబడి పెట్టాం. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. మార్కెట్కు వేరుశనగ తెస్తే ధరలు లేవు. పండిన పంట అంతా ఆసామి అప్పుకు సరిపోవడం లేదు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. వ్యవసాయ ఖర్చులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. రైతులకు ప్రభుత్వపరంగా చేయూత లేకపోవడంతో వ్యవసాయం చేయాలంటే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులకు చేయూతనిచ్చి ఆదుకోవాలి.
– తాయన్న, రైతు, మిట్టదొడ్డి