నారాయణపేట రూరల్, డిసెంబర్ 12 : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. మొన్న మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఇకపై ఎకడా పురుగుల అన్నం, రాళ్ల అన్నం లేకుండా నాణ్యమైన భోజనం వండించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనడానికి తాజాగా నారాయణపేట గ్రౌండ్ స్కూల్లో చోటు చేసుకున్న సంఘటనే ఉదాహరణ. పాఠశాలలో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగం 400 మందికి గురువారం మధ్యాహ్న భోజనం కోసం 50 కిలోల బియ్యంతో వంట చేయించారు. అయితే అన్నం లో పురుగులు, రాళ్లు కనిపించడంతో విద్యార్థులు పారబోశారు. విద్యార్థుల కడుపుమంటను తెలుసుకొన్న పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు బడి వద్దకు చేరుకొని విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో హెచ్ఎం దత్తురావు స్పందించి వారికి నచ్చజెప్పి వేరే బియ్యంతో మళ్లా భోజనం వండించి పెట్టడంతో సద్దుమణిగింది.
భోజనంలో నాణ్యత పాటించాలి
రేవంత్రెడ్డి ప్రజాపాలనలో ప్రభుత్వ బడుల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు రావడం సిగ్గుచేటమని పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్ ధ్వజమెత్తారు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వ పాఠశాలలు నాణ్యత పాటించాలని, లేకుంటే పీడీఎస్యూ ఆధ్వర్యంలో తాసీల్దార్, కలెక్టర్, ఎమ్మెల్యే కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కమిటీ సభ్యులు పార్వతి, సాగర్, నాయకులు విష్ణు, రేణుక, అంజి, వైశాలి, న ర్సింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన విషయంపై డీఈవో గోవిందరాజులు, మిడ్ డే మిల్స్ ఇన్చార్జి యాదయ్యశెట్టిని వివరణ కోరగా జిల్లాలోని పాఠశాలల హెచ్ఎంలకు సమావేశం నిర్వహించి బియ్యం సరిగ్గా లేకుంటే వెంటనే మార్పించి మధ్యాహ్న భోజనం వండి, వడ్డించాలని సూచించామన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీ, ఫుడ్ ఇన్చార్జి, ఐదుగరు విద్యార్థులతో ఫుడ్ స్టూడెంట్ కమిటీ ఏర్పాటు చేశామని, ఎక్కడా పొరపాటు జరిగిం దో నేడు విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇన్చార్జి హెచ్ఎం దత్తురావును వివరణ కోర గా.. బుధవారం ప్రభుత్వ సివిల్ సప్లయి గో దాం నుంచి తీసుకొచ్చిన కొత్త బియ్యంతోనే మ ధ్యాహ్న భోజనం వండామన్నారు. అలాగే ఆ బియ్యం ఎలా ఉన్నాయో కూడా మేము పూర్తి గా పరిశీలించలేదన్నారు. విద్యార్థుల నిరసనతో మళ్లీ కొత్త బియ్యాన్ని జల్లెడపట్టి వండించి భోజనం వడ్డించామన్నారు. పాఠశాలకు తెచ్చిన బియ్యం మొత్తం పరిశీలించి వాటిని జల్లెడ పట్టి ఇకపై ఎలాంటి పొరపాట్లు లేకుండా నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు.