బిరబిరా పారేందుకు కృష్ణమ్మ సిద్ధమవుతున్నది. దశాబ్దాల కల సాకారానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అడుగు దూరంలో నిలిచింది. పొలాల్లో పరుగులు పెట్టి మురిపించేందుకు.. పల్లెవాసుల గొంతును తడిపి మైమరపించేందుకు ఎత్తిపోతల సిద్ధమైంది. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరేందుకు ఉవ్విళ్లూరుతున్నది. త్వరలో కాల్వలు, రిజర్వాయర్లల్లో నీలవేణి జలతాండవం చేయనున్నది. ఈ క్రమంలో 3వ తేదీన లిఫ్ట్ డ్రై రన్‌కు.. 15న వెట్న్ నిర్వహణకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద 400/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ చార్జింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఈ పంప్‌హౌస్‌లో 149 హార్స్ పవర్ ఉన్న 9 బాహుబలి పంపులు బిగించే ప్రక్రియ చివరి దశలో ఉన్నది. దీంతో నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఇందుకోసం ప్రాజెక్టు వద్ద పనుల్లో రాత్రింబవళ్లు ఇంజినీర్లు, అధికారులు నిమగ్నమయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, అగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పాలమూరు’ కల సాకారం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సన్నద్ధమైంది. ఇందుకోసం మరో అడుగు దూరంలో పనులు ఉన్నాయి. పీఆర్ఎల్ఐకి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో సర్కారు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నది. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లా ఏదుల, బిజినేపల్లి సమీపంలోని వట్టెం, జడ్చర్ల సమీపంలోని ఉదండాపూర్ పంప్‌హౌస్‌లను సిద్ధం చేసింది. ఈ నాలుగు పంప్‌హౌస్‌ల వద్ద 400 కేవీ విద్యుత్ సబ్స్టేష్టన్లు నిర్మాణం జరిగింది.
రెండ్రోజుల్లో డ్రైరన్
రెండు నెలల కిందట ఏదుల సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. రెండ్రోజుల కిందట నార్లాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సాఫీగా జరగడంతో 3న వెట్న్‌క్రు సిద్ధమైంది. నార్లాపూర్ పంప్‌హౌస్‌లో 149 హార్స్పవర్ ఉన్న తొమ్మిది బాహుబలి పంపులను ఏర్పాటు చేశారు. ఈ పంపులు బిగించే ప్రక్రియ పూర్తి కావచ్చింది. డ్రైరన్ విజయవంతంగా అయ్యాక వెట్న్ నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 15న ముహూర్తం ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. దీంతో ఈ ఎత్తిపోతల పథకం అన్ని అడ్డంకులను దాటుకొని వడివడిగా అడుగులు వేస్తున్నది. సాగునీటి కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నాళ్లో వేచిన కల
దశాబ్దాలుగా వేచిన కల నెరవేరనుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. అనుకున్నట్లు అన్ని పనులు పూర్తయితే దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిలవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద ఉన్న ఐదు భారీ రిజర్వాయర్లలో రెండు పూర్తవగా.. మరో రెండింటి పనులు చివరి దశలో ఉన్నాయి. ఇంకోటి వచ్చేనెలాఖరుకు పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు లేవంటూ విపక్షాలు చేసిన విషప్రచారాన్ని పటాపంచలు చేస్తూ పనులను ప్రభుత్వం శరవేగంగా నిర్వహిస్తున్నది. దీంతో విపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రైతుల కండ్ల ముందు భారీ ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు పారనుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో విస్తృత చర్చ
పాలమూరు ఎత్తిపోతల పనులపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న రిజర్వాయర్లను సందర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ప్రాజెక్టును విజిట్ చేశారు. రైతులు, కార్యకర్తలకు పథకం పనులను దగ్గరుండి చూపిస్తున్నారు. ఈ పనులను చూసిన ప్రతి ఒక్కరూ ఔరా అంటున్నారు. ఇంతటి ప్రాజెక్టు పనులను భారీ ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తుందా.. అని ఆశ్చర్యపోతున్నారు.
అడుగు దూరంలో..
కరువు, ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా మీదుగా జీవనదులు పారుతున్నా ఉమ్మడి పాలనలో ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కరువుతో పొట్టచేత బట్టుకొని ఇక్కడి ప్రజలు చాలా వరకు సుదూర ప్రాంతాలకు వలసబాట పట్టారు. కృష్ణా నీటిని అందించాలని కోరితే ఉమ్మడి జిల్లా ఎత్తులో ఉంటుంది.. నది దిగువన పారుతుంది.. సాగునీరు పారించేందుకు అవకాశం లేదని ప్రజలను మోసం చేశారు. కానీ తర్వాత నీళ్లు, నిధుల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. దీంతో 2014లో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులను మార్చింది. ఏకంగా తొమ్మిదేండ్లలో అదనంగా 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు సాగునీరు పారించింది. మిషన్ కాకతీయ ఫలితంగా చెరువులన్నింటిలో నీటిని ఒడిసిపట్టింది. భూగర్భ జలాలు పెరిగాయి. వృథాగా వాగుల్లో పారుతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యాంలు నిర్మించారు. దీంతో అదనంగా వందల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఎక్కడ చూసినా జలరాశులతో ఎండాకాలంలోనూ జలదృశ్యం సాక్షాత్కరిస్తున్నది. కృష్ణా నీరు బీడు భూముల్లో జలతాండవం చేయాలని రైతులు ఆశలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అరవై ఏండ్ల కల అడుగు దూరంలో ఉండటంతో పాలమూరు డ్రైరన్ విజయవంతం కావాలని ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల
పాలమూరు ఎత్తిపోతల పథకం దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించనున్నది. ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దితే.. అంతకు మించి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మరో రికార్డు సృష్టించబోతున్నారు ఇంజనీర్లు. 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే భారీ ఎత్తిపోతల పథకంగా పేరు గడించనున్నదని చెబుతున్నారు. మొత్తం 21 ప్యాకేజీల్లో పనులు చేపట్టారు. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 16 నియోజకవర్గాలకు తాగునీరు అందనుండగా.. 1, 546 చెరువులను నింపనున్నారు. మరో 1,326 గ్రామాలకు అదనంగా తాగునీరు అందనున్నది. ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ ప్రాజెక్టు దేశంలోనే బిగ్గెస్ట్ లిఫ్ట్‌గా రికార్డు నమోదు చేయనున్నది.
నాలుగు సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా..
పాలమూరు ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన సబ్స్టేషన్లను యుద్ధప్రాతిపదిక నిర్మించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల సమీపంలో నిర్మించిన నాలుగు సబ్స్టేషన్లు ఒక్కొక్కటీ 400 కేవీ కెపాసిటీ కలిగినవి. ఏదుల సబ్‌స్టేషన్‌కు నల్లగొండ జిల్లా డిండి నుంచి 60 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు వేసి విద్యుత్ టెస్టింగ్‌ను రెండు నెలల కిందట నిర్వహించారు. తాజాగా ఏదుల నుంచి నార్లాపూర్ వరకు 30 కిలోమీటర్ల విద్యుత్ లైన్లోకు టెస్టింగ్ నిర్వహించి పవర్ చార్జ్ చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యుత్ సరఫరా విజయవంతమైంది. దీంతో సీఎండీ ప్రభాకర్‌రావు నార్లాపూర్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి ఇంజినీరింగ్ అధికారులను కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. నాలుగు సబ్స్టేషన్లకు సుమారు 3 వందల కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. నార్లాపూర్ వద్ద 165 ఏంవీఏ సామర్థ్యం ఉన్న 9 పవర్ ట్రాన్స్పార్మర్లను బిగించారు. 25 ఎంవీఏ సామర్థ్యం ఉన్న రెండు స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. టెస్ట్డ్ చార్జింగ్ డిండి నుంచి ఏదులా.. ఏదులా నుంచి నార్లాపూర్ వరకు విద్యుత్ సరఫరా విజయవంతం కావడంతో ఇంజినీర్లు అభినందించారు. ఈమొత్తం నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లకు రూ.2,155 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది..
ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో కలిసి పాలమూరు జిల్లా కరు వు, వలసల స్థితిని చూసి చలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానే స్వయంగా ఇంజినీర్లతో అనేక రాత్రులు, ప గళ్లు చర్చలు జరిపి తుదిరూపం ఇచ్చారు. విపక్షాలు ఎన్ని కేసు లు వేసినా.. కేంద్రం నీటి వా టాను తేల్చకున్నా.. పట్టుదలతో ముఖ్యమంత్రి అనుకున్న ది సాధించారు. ఇవాళ పాలమూరు ఉమ్మడి జిల్లా చిరకాల స్వప్నాన్ని నేరవేరుస్తున్నారు. అంబేద్కర్ సచివాలయాన్ని ప్రారంభించిన మరుసటిరోజే ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించి ఈజిల్లాపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. సాగునీళ్లొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే