మూసాపేట(దేవరకద్ర), మే 9 : పండించిన ధాన్యం అమ్మడం కోసం రైతులు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోరా అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. దేవరకద్ర మండలంలోని గోపన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి మాజీ ఎమ్మెల్యే ఆల పార్టీ శ్రేణులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు కలిసి కల్లాల వద్దనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైతులు పెట్టుబడి పెట్టి పంటను సాగుచేసి నానా అవస్థలు పడి పండించిన పంటను కూడా ఆంక్షల పేరుతో కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో రైతులు కల్లాల వద్దనే రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. వారి కష్టాలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో అన్నదాత గుండె రోధిస్తుందన్నారు. నాడు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలో కూడా రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు కొర్రిలు పెట్టి అధికారులు కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ఆయన అన్నారు. వెంటనే ఆంక్షలు లేకుండా రైతులతో ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని, లేదంటే రైతులు చేపట్టే కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెట్టి నర్సింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజనేయులు, సత్యంసాగర్, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, చల్మారెడ్డిలతో పాటు ఆయా గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.