మాగనూరు/ కృష్ణ డిసెంబర్ 15 : అక్రమంగా తెలంగాణలోకి వరి ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను పట్టుకొని సీజ్ చేసిన ఘటన కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ గుర్రాజరావు, ఏవో సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం కృష్ణ మండలంలోని చేగుంట గ్రామ సమీపంలోని ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి కర్ణాటక నుంచి అక్రమంగా వరిధాన్యంతో తెలంగాణలోకి వస్తున్న 6 లారీలను అదుపులోకి తీసుకొని కృష్ణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
డ్రైవర్లతో వివరాలు సేకరించగా కర్ణాటక రాష్ట్రంలోని సిరిపూర్ గ్రామం నుంచి తెలంగాణలోని మిర్యాలగూడ శివశంకర ఇండస్ట్రీస్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. లారీలో 2,400 బస్తాలు ఉన్నాయని వాటి విలువ రూ.40 లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. లారీలను ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ గుర్రాజరావు ఆదివారం పరిశీలించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆరు లారీల్లో 5,100 బస్తాలు ఉండవచ్చని వాటి విలువ రూ.50 లక్షలపై మాటేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక అధికారి తప్పుడు సమాచారంతో పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పడంతో అధికారిపై పలు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.