భూత్పూర్, జూన్ 4 : రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కార్మికుడు అతను. మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తూ.. చాలిచాలనీ జీతంతో బతుకు బండి లాగుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. దీంతో ఆ కార్మికుడి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. కాగా మనసున్న ఉపాధ్యాయులందరూ కలిసి రూ. లక్ష వరకు జమ చేసి.. ఆ నిరుపేద కార్మికుడి కుటుంబానికి అందజేసి.. ఔదార్యం చాటుకున్నారు.
మండల కేంద్రానికి చెందిన అనుప చంద్రశేఖర్.. పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం.. చంద్రశేఖర్ మృతితో మరింత దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది.
విషయం తెలుసుకున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రూ. 50 వేల వరకు జమ చేశారు. అదే విధంగా మండల పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సత్తార్ బాలరాజు గౌడ్, కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొప్పోలు యాదయ్య పిలుపు మేరకు పీఆర్టీయూ సంఘం నాయకులు, సభ్యులు స్పందించి మరో రూ. 50 వేలు జమ చేశారు. బుధవారం చంద్రశేఖర్ భార్య అమృతకు జిల్లా టీఆర్టీయూ అధ్యక్షుడు మదన్మోహన్ యాదవ్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మదన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ సిబ్బంది ఆర్థిక పరిస్థితిని గుర్తించి రూ. లక్ష జమ చేసి ఇవ్వడం చాలా అభినందనీయమన్నారు. ఇక ముందు కూడా ఉపాధ్యాయులు సేవ కార్యక్రమాలలో ముందు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు బుచ్చారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు దస్తయ్య, టీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులు పద్మ, పద్మావతి, సాయిరాం గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.