కల్వకుర్తి, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ లు విఫలం కావడంతో తెల్లవారుజామున నుంచే కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపో సమీపంలోని ఖాళీ స్థ లంలో వంటావార్పు చేపట్టి నిరసన కొనసాగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద బుధవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డీ ఎస్పీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు డి పో వద్దకు చేరుకొని కార్మికులతో చర్చలు జరిపారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బస్సులను వదలాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు ససేమిరా అనడంతో పోలీసుల వలయంలో మూడు బస్సులను తాత్కాలిక సిబ్బంది చేత బయటకు తరలించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని వచ్చిన కార్మికులు నాలుగో బస్సు బయటకు రాకుండా అడ్డంగా పడిపోయారు. కార్మికులను అడ్డుతొలగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొందరు కార్మికులు బస్సులకు అడ్డంగా నేలపై పడుకున్నారు.
పోలీసులు కార్మికులను ఈడ్చి పడేసి బస్సులను బయటకు పంపించేందుకు యత్నిస్తుండంతో కార్మికులు ఒక్కసారిగా బస్సులకు ఎదురేగారు. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి బయటకు వస్తున్న బస్సుపై రాళ్లు విసరగా అద్దం పగిలింది. తాత్కాలిక డ్రైవర్ కండ్లలో కారం పొడి చల్లడంతో బస్సు దిగి పరారయ్యాడు. దీంతో ఆర్టీసీ, పోలీస్ అధికారులు వెనకడుగు వేశారు. బస్సును తిరిగి డిపోలోకి తీసుకెళ్లిపోయారు. తమ హక్కుల సాధన కోసం, ఆర్టీసీ బతుకు కోసం సమ్మె చేస్తుంటే.. సమ్మె నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలతో బస్సులను నడిపించేందుకు కుట్ర పన్నిందని ఆగ్రహం చెందారు.