వనపర్తిరూరల్, ఫిబ్రవరి 25: మత్స్యకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి సహకారం అందిస్తున్నది. నీటివనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్యకారులు కొత్తగా సభ్యత్వాలు పొందేందుకు అవకాశం కల్పించింది. దీంతో కొత్త సంఘాలు అందుబాటులోకి రానున్నాయి. సభ్యులను చేర్చుకునే ప్రక్రియలో అధికారులు ఈ సారి ప్రత్యేక దృష్టి సారించారు. కొత్తవారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి సభ్యత్వాలను అందజేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని 14మండలాల్లో ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. మత్స్యసంపద పెరగడంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుంది. అలాగే ప్రభుత్వం ఏటా చేపపిల్లలను ఉచితంగా పంపి ణీ చేస్తున్నది. మత్స్యకారులు సంఘాల్లో చేరితే ప్రయోజనం ఉంటుందని మత్స్యశాఖ అధికారు లు మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే సభ్యుడికి రూ.5లక్షల బీమా కల్పిస్తున్నారు. అలాగే చేపలవేటకు సంబంధించి సభ్యుడికి వల వేయడం, తెప్పపై వెళ్లడం, పాండి వల లాగడం, వల అల్లడం, ఈత కొట్టడం తదితర నైపుణ్యాలు నేర్పించడం, అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కమిటీ ఆమోదం తర్వాత ఒక్కో మత్స్యకారుడి నుంచి రూ.55 సభ్యత్వ రుసుం తీసుకొని నమోదు చేసుకుంటున్నారు.
విస్తీర్ణం ఆధారంగా ..
చెరువులో నీటి నిల్వ, విస్తీర్ణం ఆధారంగా సభ్యుల సంఖ్యను పెంచేందుకు వీలుంటుంది. వర్షాధారంగా నిండే చెరువులో రెండెకరాల విస్తీర్ణానికి ఒక మత్స్యకారుడికి స్థానిక సంఘంలో సభ్యత్వం కల్పిస్తారు. ఎన్ని ఎకరాలుంటే అంతమంది సంఘంలో చేరుతారు. కాల్వల ద్వారా నిండే చెరువులకు సంబంధించి ఎకరానికి ఒక మత్స్యకారుడికి సంఘంలో చోటు దక్కుతుంది. ఒక సంఘంలో కనీసం 11మంది సభ్యులుండాలి. ప్రక్రియను మార్చిలోపు పూర్తిచేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నారు. అదేవిధంగా మహిళా మత్స్యకార సంఘాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం పురుషులకు సంబంధించిన సంఘాల్లోనే కొత్త సభ్యత్వాలు, సంఘాలకు అవకాశం కల్పిస్తున్నారు. మహిళా సంఘాల్లో వీలును బట్టి సభ్యుల సంఖ్య పెంచడం, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
వనపర్తి జిల్లాలోని సంఘాలు
జిల్లాలో మొత్తం 133సంఘాలకు గానూ 11,627సభ్యులు ఉన్నారు. కొత్తగా మూడు పురుషుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం పురుషుల సంఘాలు 116కుగానూ 10,232సభ్యత్వాలు, మహిళా సంఘాలు 15కాగా, 743మంది సభ్యత్వాలు పొందారు. అదేవిధంగా మార్కెటింగ్ సంఘాలు రెండు ఉండగా 652మంది సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో అమరచింత, పెబ్బేరు మండలంలో మాత్రమే మార్కెటింగ్ సంఘాలు ఉన్నాయి. జిల్లాలోని అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 18మత్స్యకార సంఘాలు, అత్యల్పంగా శ్రీరంగపురంలో నాలుగు సంఘాలు ఉన్నాయి.
మత్స్యసంపద పెంపునకు కృషి
జిల్లాలో సాగునీరు రాకతో ఓ వైపు సాగు, మరో వైపు మత్స్యసంపద పెరిగింది. మత్స్యసంపద పెంచేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి ఎంతోగానో ఉన్నది. ప్రతి చెరువు, కుంటను నింపి సాగు, మత్స్యసంపదకు దోహదపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకున్నాం. అలాగే జిల్లాలో మత్స్య సొసైటీల బలోపేతానికి ఇప్పటికే అనేక పథకాలను అందజేశాం. మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుతోపాటు వ్యాపార అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.
– రెహమాన్, మత్స్యశాఖాధికారి, వనపర్తి జిల్లా