మరికల్, జూలై 2 : మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి కుంటలా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల ప్రహరీని ఇటీవల రూ.8.25 లక్షలతో నిర్మించారు. అయితే పాఠశాలలో వర్షపు నీరు బయటకు పోయేందుకు అవకాశం లేకుం డా ప్రహరీని నిర్మించారు.
అయితే రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి పాఠశాల ఆవరణ మొత్తం నీరు నిలవడంతో కనీసం తరగతి గదుల్లోకి కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షం నీటిని బయటకు తరలించేందుకు మోటర్లు పెట్టి ప్రయత్నిస్తున్నా నీరు తగ్గకపోవడంతో తమ పిల్లల చదువులు కొనసాగడం ఎలాగని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే విద్యార్థులు పాఠశాలకు రావా లా.. వద్దా అని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రహరీ నిర్మించిన సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.