నాగర్‌కర్నూల్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యుల పాత్ర కీలకమన్నారు.
ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ నినాదాన్ని ప్రజలోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌మాట్లాడుతూ ఒకప్పుడు డిగ్రీ కళాశాల లేని నాగర్‌కర్నూల్‌లో ఇప్పుడు మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. ఇంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులందరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి సతీమణి మర్రి జమున, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ కల్పనాభాస్కర్‌గౌడ్, బూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.