మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని రైతులు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి( Lakshma Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న ( Maize ) పంటను గోదాంలకు తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు జడ్చర్ల కల్వకుర్తి జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రైతులకు మద్దతు పలికారు.
ఆయన మాట్లాడుతూ దాదాపు నలభై రోజులుగా రైతులు ధాన్యం, మొక్కజొన్న అమ్మకాల కోసం మార్కెట్లోనే ఉంటున్నారని పంట పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో, అంతకంటే ఎక్కువ అమ్ముకోవడానికి కష్టపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజా పాలనలో రైతులు రోడ్డెక్కల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.
జడ్చర్ల మార్కెట్లో ఉన్న నలబై వేల బస్తాలు వెంటనే గోదాం కు తరలించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పంట ఎంత సాగు చేశారు. దిగుబడి మీద అంచనా లేకపోవడం,గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలు,గోదాం వంటి అంశాలపై ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.