ఊట్కూర్, జూన్ 15 : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాల్ ప్రభుత్వ విద్యపై తనకున్న విశ్వాసాన్ని చాటిచెప్పాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన జరుగుతోందనే సందేశాన్ని సమాజానికి అందించేందుకు తన కుమారుడు లక్షిత్ నందను సోమవారం అదే పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజునే కుమారుడి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, శిరీష, వసుంధర, అనిల్ తదితరులు పాల్గొన్నారు.