వనపర్తి టౌన్, డిసెంబర్ 22 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్తీ గ్యాంగ్‌కు చెందిన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు జోగుళాంబ గద్వాల ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం వనపర్తి ఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఐజీ వివరించారు. ఈ నెల 18న పెబ్బేర్ పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఆపిన తిరుపతి ప్రయాణికుల వాహనంపై పార్తీ గ్యాంగ్ దొంగలు దాడి చేసి గాయపర్చి బంగారు ఆభరణాలను లాక్కెళ్లారని చెప్పారు. గద్వాల నుంచి పెబ్బేర్ వరకు ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. వేలిముద్రలను తీసుకొని పరిశీలిస్తే అసలు దోపిడీ దొంగల ఆచూకీ తెలిసిందన్నారు. ఇక్కడి పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారన్నారు. ఆరుగురు నేరస్తులు కలిసి ముందే వేసుకున్న పథకం ప్రకారం బద్రి గజానన్ పింపాలే, సయ్యద్ ఫిరోజ్ మెహతాబ్ ఇద్దరు చెరుకు ట్రాక్టర్లు తీసుకొచ్చి హైవే 44పై పెబ్బేరు శివారులోని ట్రక్వేపై పార్కు చేయగా మిగిలిన నలుగురు రెండు బైకులపై వచ్చి పక్కనే ఉన్న పొలాల్లో నక్కి ముందు రెండు కార్డు పార్కింగ్ స్థలంలోకి రాగా అందులో మగవారు ఉండి వారు నిద్రించకపోవడంతో దోపిడీకి అవకాశం లేదని, ఆ తర్వాత వచ్చిన కార్లలో మగవారితోపాటు ఆడవారు ఉండి అందరూ కార్లలో పడుకోవడంతో మొదట కారుపై ఉన్న లగేజీ బ్యాగులను తీసుకెళ్లి పరిశీలించగా అందులో ప్రసాదం దుస్తులే కనిపించాయని తిరిగి వారు కారు వద్దకు వచ్చి అంతా ఒకేసారి కారుపై అన్ని వైపుల నుంచి కట్టెలు, రాళ్లతో దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టి భయబ్రాంతులకు గురిచేసి ఆడవారి మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కేళ్లారన్నారు.
డ్రైవర్ మెడలో ఉన్న గొలుసును, కారు తాళాన్ని లాక్కోని పారిపోతుండగా అతను తాళాల కోసం వెంట పడగా అతడిని తీవ్రంగా గాయపర్చారన్నారు. ఈ నెల 13న జగిత్యాల జిల్లాకు చెందని రజిని కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి, అరుణాచల్‌ప్రదేశ్ తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ పెబ్బేర్ శివారులోని హైవే 44పై ట్రక్ లేబైపై కారును నిలుపుకొని నిద్రిస్తుండగా పార్తీ గ్యాంగ్ దొంగలు ఒక్కసారిగా కారుపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేసి గాయపరిచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వేలిముద్రల సాయంతో శనివారం దొంగలను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారని చెప్పా రు. నిందితులు శ్రీరాం శివాజీ షిండే, సచిన్ సంతోష్‌షిండే, ట్రాక్ట ర్ డ్రైవర్లు బద్రీ గజనాన్ పింపాలే, సయ్యద్ ఫిరోజ్ మెహతాబ్లాలు ఉన్నారన్నారు. సంతోష్ పాండ్గంగ్కాలే, సంజయ్ పవార్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి రూ.7లక్షల విలువగల 20 గ్రాముల బంగారు పుస్తెల తాడు, 15 గ్రాముల గొలుసు, 10 గ్రాముల నల్లపూసల దండా, మూడు సెల్ఫోన్లు, రెండు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవడానికి యత్నిస్తున్నామని వివరించారు. అయితే కేసు పర్యవేక్షణలో చొరవ చూపిన ఎస్సైలు, కానిస్టేబుల్స్‌కు ఐజీ రివార్డులు అందజేశారు.
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్‌రెడ్డి హత్య 95శాతం పూర్తయ్యిందని ఐజీ సత్యనారాయణ చెప్పారు. డీజీపీ, ముఖ్యమంత్రి ఆదేశానుసారం కేసుప్రత్యేకంగా తీసుకొని ఎస్పీ ఆధ్వర్యంలో 95 శాతం పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 52మందిని విచారణ చేశామని, గుజరాత్లో ఉన్న జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లైవ్ డిటెక్టీవ్ ఆధారంగా శాస్త్రీయ పద్ద్ధతిలో కేసును ఛేదిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ఉద్దేశంతో చాలా సున్నితంగా, విస్తృతంగా కేసును విచారిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో ఎస్పీ రావుల గిరిదర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.