మహబూబ్ నగర్ కలెక్టరేట్ : కౌమారదశలోని బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పాలమూరులో గుడ్ యూనివర్స్ ఒక అడుగు ముందుకు వేసిందని, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తామని గుడ్ యూనివర్స్ NGO వ్యవస్థాపకులు కమల్ కంచన్ చెప్పారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోనపాలమూరు బాలికల ఉన్నత పాఠశాలలో గుడ్ యూనివర్స్ NGO 6 నెలల ప్రాజెక్టు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో స్థిరమైన రుతు ఆరోగ్యం కోసం గుడ్ యూనివర్స్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో సస్టెయినబుల్ మెన్ స్ట్రువల్ హెల్త్ ఫర్ అడోలోసెంట్ గర్ల్స్ (కౌమర బాలికలకు స్థిరమైన రుతుక్రమ ఆరోగ్యం) అనే అంశంపై చేపట్టిన ఆరు నెలల ప్రాజెక్టు విజయవంతంగా ముగిసిందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ డ్డి, కలెక్టర్ విజయేందిరబోయి అందించిన సహకారం, ప్రోత్సాహం మరవలేనిదని కొనియాడారు.
పర్యావరణ అనుకూల రుతు మార్గాలు, పరిష్కారాలు, బహిరంగంగా చర్చించేందుకు అవసరమైన అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాలమూరు యువత భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన, కళంకం లేని భవిష్యత్తుకు గుడ్ యూనివర్స్ ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తరిస్తూ మందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ లీడ్ కన్సల్టెంట్, ప్రోగ్రామ్ మేనేజర్ వంశీ మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తులో సమాజం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరి ఎదుగుదలలో కౌమార దశ చాలా కీలకమైనదని, 10 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఆరోగ్య పరిక్షణతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల వారు భవిష్యత్తులో ఉన్నతులుగా ఎదిగే అవకాశముందన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి మాట్లాడుతూ.. యువత ఎదుర్కొనే లైంగిక ఆరోగ్యం, శరీరంలోని వివిధ అవయవాల్లో వచ్చే మార్పులు, ఆరోగ్య పరిరక్షణ, రహదారి భద్రత, సామాజిక మాధ్యమాల వల్ల లాభనష్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
గుడ్ యూనివర్స్ సహ వ్యవస్థాపకురాలు నీలోఫర్ తబస్సుమ్ మాట్లాడుతూ.. విద్యార్థినిల ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరు నెలలుగా గుడ్ యూనివర్స్ NGO ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులకు క్లాత్ ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనాపాలమూరు ఉన్నత పాఠశాల జీహెచ్ఎం డెబోరా, ప్రతినిధులు మధు, ఆప్రా, సైఫ్, అదీరా, రాధ, తదితరులు పాల్గొన్నారు.