కల్వకుర్తి, ఏప్రిల్ 14 : కమీషన్ల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమ్మక్కై గొల్లపల్లి-చీర్కపల్లి సాగునీటి ప్రాజెక్టును తెరమీదకి తీసుకొచ్చారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దుయ్యబట్టారు. గొల్లపల్లి ప్రాజెక్టు అవసరం లేదని 2018లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. మంగళవారం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. గొల్లపల్లి- చీర్కపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మూడు పంటలు పండించే 1350 ఎకరాల పచ్చని పంట పొలాలు ముంపునకు గురవుతాయనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించిందని చెప్పారు. ముంపు ప్రాంతాలను కాపాడాటానికి ఏదుల నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక తూము ద్వారా సాగునీరు అందించవచ్చని, దీనికి గొల్లపల్లి- చీర్కపల్లి ప్రాజక్టు అవసరం లేదని రద్దు చేసిన విషయాలను మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ సాగునీటికి పితామహుడని అన్నారు. నెర్రెలు పారిన బీడు పొలాలను పచ్చటి పంట పొలాలుగా మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం 25 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను 100 టీఎంసీలకు పెంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ తూము ద్వారా కూతవేటు దూరంలో ఉన్న పాన్‌గల్, కోడేరు, వనపర్తి మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తే.. ఇప్పుడు అక్కరకు రాని గొల్లపల్లి- చీర్కపల్లి ప్రాజెక్టును తెరమీదకు తీసుకువచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టి కమీషన్ల రూపంలో పంచుకునేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. రూ.11వందల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న గొల్లపల్లి ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆధారపడిన వందల కుటుంబాలను రోడ్డుమీద వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని ఆయన ధ్వజమెత్తారు.
ఎవరికి అవసరం లేని గొల్లపల్లి ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే నిర్మాణం చేపడితే సాగునీటి విషయంలో కల్వకుర్తి సాగునీటి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజవకర్గానికి కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజుక్టుల ద్వారా దాదాపు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. టెయిల్ ఎండ్ ప్రాంతమైన కల్వకుర్తికి సాగునీరు విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఎవరికీ అవసరం లేని గొల్లపల్లి ప్రాజెక్టును వెంటనే ఆపకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టుతామని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విజితారెడ్డి, సర్పంచుల సం ఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మరెడ్డి, మున్సినల్ కౌన్సిలర్లు షాహెద్, రామునాయక్, బీఆర్ఎస్ మండల నాయకులు సైదులుగౌడ్, సత్యం, మూర్తి, గోపాల్, ఖాద ర్, ముజ్జు, బోజ్జయ్య, శ్రీనివాస్‌రెడ్డి, హహమూద్, మల్లేశ్, నాగేశ్‌గౌడ్,మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.