దుండిగల్, జూలై 23 : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా, కన్నకూతురు ఆరోగ్య పరిస్థితి విషమించినా కనీస మానవత్వం చూపకుండా ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని తీవ్ర మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆమెను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన దారుణ ఉదంతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని టెక్ మహీంద్రా సంస్థలో వెలుగుచూసింది. కంపెనీ యాజమాన్యం వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితురాలు ఆపై టెక్‌మహీంద్రా ముందు గురువారం ఆందోళనకు దిగారు. బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె నాలుగున్నర నెలల క్రితం ఎంతో శ్రమపడి ఇంటర్వ్యూలు క్రాక్ చేసి టెక్‌మహేంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరింది. జూన్ నెలలో ఆఫీసులోనే పనిచేస్తుండగానే తీవ్ర అనారోగ్యానికి గురై ఫ్లోర్‌పైనే స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను ముందుగా క్యాంపస్ దవాఖానకు, ఆపై మల్లారెడ్డి వైద్యశాలకు, అనంతరం నగరంలోని జీనియా హాస్పిటల్స్‌కు తరలించారు. ఆమె స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించిన వైద్యులు 15 రోజులపాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని సూచించడంతో ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందుతున్నది.
ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను సైతం కంపెనీకి పంపించింది. అయినప్పటికీ యాజమాన్యం ఆమెను ఆరోగ్య పరిస్థితి అడగకుండా ఎప్పుడు ఆఫీస్‌కు వస్తున్నారు? రాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాం అంటూ ఈ మెయిల్స్ పంపడం ప్రారంభించారు. ఇటీవల తన కూతురు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో మూడురోజులపాటు సెలవు తీసుకొని ఇంటికి వెళ్తుండగా.. ఆఫీస్ లాగిన్ చేయాలని, లేకపోతే గైర్హాజరుగా పరిగణిస్తామని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆ తరువాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఈ మెయిల్స్ పంపించారు. దీంతో విసుగుచెందిన భావన కంపెనీ టాక్సిక్ వాతావరణం, యాజమాన్య వేధింపులపై దుండిగల్ పోలీసులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తనను లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.
మెడికల్ లీవ్‌లో ఉన్న తనను ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ భావన గురువారం టెక్‌మహీంద్ర ముందు ఆందోళనకు దిగింది. తనలాంటి బాధితులు టెక్‌మహీంద్రలో ఎందరో ఉన్నారని, అందరికీ న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఉద్యోగం సంపాదిస్తే.. అకస్మాత్తుగా విధుల్లో నుంచి ఎలా టెర్మినేట్ చేస్తారని నిలదీశారు. కంపెనీ లోపల ఉద్యోగులెవరికీ స్వేచ్ఛలేదని, కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా తమపై అధికారికి చెప్పే వెళ్లాల్సి ఉంటుందని ఆరోపించారు. కంపెనీలో జరుగుతున్న వేధింపుల పట్ల ఐటీ మంత్రిత్వశాఖకు సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.