Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 11: భక్తులకు వెలుగు ప్రసాదించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చీకటి అలుముకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో ఉన్న అతి పురాతనమైన ఈదమ్మ తల్లి ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఈదమ్మ తల్లి జాతరలో మొదటి మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న జాతరలో కనీస విద్యుత్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో భక్తులు చీకట్లోనే అమ్మ వారిని దర్శించుకున్నారు. జాతరలో మహిళా భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వచ్చే మంగళవారం షిడే వారం కావడంతో వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆలయ కమిటీ నిర్వాహకులు అధికార యంత్రాంగం స్పందించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.