గద్వాల, జూన్ 6 : వైద్యం అందక 17ఏండ్ల బాలిక మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు అనే బాలికకు కడుపునొప్పి రావడంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. సీటీ స్కాన్ చేయించాలని కుటుంబ సభ్యులకు సూచిస్తే స్కాన్ చేయించారు.
అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం వరకు ఆపరేషన్ చేస్తున్నామని చెప్పిన వైద్యులు ఏడుగంటల తర్వాత బాలిక మృతిచెందిందని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు చెప్పారు. మృతురాలి కుటంబసభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి శవాన్ని తమ స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించినట్లు మృతురాలి తండ్రి గోపాల్ తెలిపారు. అయితే వైద్యం వికటించి మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు.
అయితే అంబులెన్స్‌ను దవాఖానలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు జిల్లా దవాఖాన ఎదుట, కర్నూల్ రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మృతిచెందిన బాలికకు సంబంధించి డెత్ సర్టిఫికెట్, పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని ఆఘమేఘాల మీద గ్రామానికి తరలించడం ఏమిటని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్యులను ప్రశ్నించారు. దీంతో కొంతసేపు దవాఖాన వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య సద్దుమణుగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.