మద్దూర్ (కొతపల్లి), ఫిబ్రవరి 21 : కలుషిత నీరు తాగి బాలిక మృతి చెందగా.. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినపూర్లో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు వివరాలు..మోమినపూర్లోని బోయినగేరి కాలనీలో మురుగు కాలువ పక్కనే బోరు ఉన్నది. స్థానికులు ఆ బోరు నీటిని తాగుతున్నారు. సోమవారం కూడా అదే నీటిని తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అదే ప్రాంతానికి అనిత(16) అనారోగ్యానికి గురైంది.
ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది. అలాగే అదే కాలనీకి చెందిన రాములు, శ్రీనివాస్ అస్వస్థతకు గురికాగా మహబూబ్నగర్ దవాఖానకు, కనకప్ప, హన్మమ్మ, చంద్రప్ప, కవిత, వెంకటప్ప, చిన్నారులు శిరీష, సువర్ణను మద్దూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించిగా చికిత్స పొందుతున్నారు. హన్మమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో రామ్మనోహర్రావు వైద్య బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ప్రతి ఇంటికెళ్లి వారి ఆరోగ్య స్థితిని పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కవితను పాలమూరుకు తరలించారు.