గద్వాల అర్బన్, జనవరి 10 : కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా పట్టుబడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పీఎస్‌లో సర్కిల్ సీఐ శ్రీను వెల్లడించారు. రెండ్రోజుల కిందట బొలేరో వాహనంలో ఇద్దరు అల్లం, కారం, వెల్లుల్లి, ఇతర ఆహార పదార్థాలను గద్వాలలోని హోల్‌సేల్ షాపులకు సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో టౌన్ ఎస్సై కళ్యాణ్‌కుమార్ సిబ్బందితో తనిఖీ చేయగా.. కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
వివరాలు ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, అలాగే నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలోని ఇండస్ట్ట్రీయల్ కంపెనీలలో కల్తీ పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ తయారైన పదార్థాలను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాన్‌గల్ మండలం కదిరెపాడుకు చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురానికి చెందిన యాస సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవ్వాడిపల్లిగ్రామానికి చెందిన జపాల శివ, హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన ఇక్బాల్, గద్వాలకు చెందిన ఖాజా హమీర్పై కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.