గద్వాల : ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ఇవాళ గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఎమ్మెల్యే కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి మాట్లాడారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం ర్యాలంపాడు రిజర్వాయర్ పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు సకాలంలో నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు సమన్వయంతో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు. వానకాలం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారని, కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సంవత్సరం ముందుగా నీటిని విడుదల చేశామని చెప్పారు.
గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి సన్నకారు రైతుకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.