జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రకారం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖలలో వీఆర్వోలను భర్తీ చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని డిప్పు ద్వారా ఆయా శాఖలకు వీఆర్వోలను కేటాయించారు.
కేటాయించిన శాఖలలో చేరేందుకు ఉత్తర్వులను సిద్ధం చేసి వీఆర్వోలకు అందజేయాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని 95 మంది వీఆర్వోల ను వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులలో వారిని భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో విజయనాయక్, డీపీవో శ్యాంసుందర్, డీఆర్డీవో నాగేంద్రం, సీపీవో లక్ష్మణ్, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.