జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ తెలుపడంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని బాలభవన్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమానికి జెడ్పీ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. రైతులు వరి ధాన్యాని పూర్తిగా ఎండపెట్టిన తరవాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, వరి లో 17% తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్.డి.ఓ రాములు, డి.ఎస్.ఓ రేవతి, మార్కెట్ యార్డ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, డి.ఎం ప్రసాద్ రావు, సరోజ, తదితరులు పాల్గొన్నారు.