గద్వాల : జిల్లాలోని ధరూర్ మండలం భీంపురం గ్రామంలో ఓ కుటుంబం ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకోవడమే కాకుండా అందులోని చెరువును కూడా కబ్జా పెట్టారని. చెరువు సమీంలోని గుట్టలు, రాళ్లను మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులో మట్టి పోస్తూ మొత్తం పూడ్చేస్తున్నారని ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని గ్రామస్తులు వాపోయారు.
చింతరేవుల శివారులోని సర్వేనెంబర్ 378లో దాదాపు 9 ఎకరాల ప్రభుత్వ బూమిని కోటిరెడ్డి అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యుల పేరిట అక్రమ పట్టా చేసుకున్నాడని ఇప్పుడు ఆ భూమిలో ఉన్న చెరువును కూడా కబ్జా చేస్తున్నాడని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని గ్రామ ప్రజలు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం రాళ్లు, మట్టి, ట్రాక్టర్లు, జేసీబీలతో పెద్దెత్తును చెరువును పూడ్చే క్రమంలో గ్రామానికి చెందిన నూక దయాకర్ అనే యువకునిపై 15 మంది దాడి చేశారు. ఈ దాడిలో దయాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్ప్రుహ కోల్పోయిన దయాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. దీనిపై దయాకర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.