ప్రైవేట్ దందా, మార్కెట్ స్థలాన్ని ఆక్రమించిన వారికి నోటీసులు
డబ్బాలను తొలగించేందుకు రంగం సిద్ధం
కోస్గి, ఆగస్టు 22 : కొత్త పాలకవర్గంలోనైనా కోస్గి మార్కెట్‌యార్డు తీరు మారుతుందా… మార్కెట్ సముదాయంలోని ప్రైవేట్ వ్యాపారాలను తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కోస్గి మార్కెట్ యార్డు పరిధిలో రెండు మండలాలు కోస్గి, మద్దూర్ మండలాలున్నాయి. పాలకవర్గం లేక ఏడేండ్లుగా మార్కెట్ యార్డులో పాలనాకుంటుపడింది. అక్రమ డబ్బాల ఏర్పాటు, ప్రైవేట్ దందాలతో మార్కెట్‌యార్డు ఇష్టానుసారంగా తయారైంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మార్కెట్ స్థలాన్ని ఆక్రమించారు. మార్కెట్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటారా.. లేదా అన్న చర్చ మార్కెట్లో మొదలైంది. కాగా కొత్త పాలకవర్గంలో సైతం కొంత సక్యత లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కోస్గి మార్కెట్ యార్డు రూపురేఖలు మారుస్తూ మార్కెట్‌కు వస్తున్న ఆదాయ వ్యయాలను సరి చేసి మార్కెట్‌కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని పలువురు మార్కెట్ వ్యాపారస్తులు కోరుతున్నారు. అయితే మార్కెట్ సముదాయంలో వ్యవసాయరంగానికి సంబంధించి విత్తనాల కొనుగోలు, అమ్మకాలు మినహ ఏ విధమైన ప్రైవేట్ దందాలు కొనసాగించడానికి వీలు లేదు. కానీ కోస్గి మార్కెట్ యార్డు ఆవరణలో అన్ని రకాల వ్యాపారాలు నడిపిస్తున్నారు. వీటిపై చర్యలకు కొత్త పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుందా లేదా అని వేచి చూడాలి.
మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం..
కోస్గి మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులకు స్థానం ఇవ్వం లేదు. మార్కెట్ అభివృద్ధికి కృషిచేస్తాం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేట్ దందాలను మూయిస్తాం. మార్కెట్ స్థలాన్ని కాపాడుతాం.
-వీరారెడ్డి, మార్కెట్ చైర్మన్