కొల్లాపూర్, ఫిబ్రవరి 22 : పేద, మధ్య తరగతి జీవితాలకు కూతురి పెండ్లంటే యుద్ధంలాంటిదే. అప్పు చేసైనా పెండ్లి చెయ్యాలె, కట్నకానులు, కన్నకూతురిని మంచి ఇంటికి పంపాలె. ఆడబిడ్డ పెండ్లి అంటే ఎన్ని ఖర్చులు, కష్టాలు ఉంటాయో అంతా తెలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడబిడ్డల మేనమామ అయ్యారు. ఆడబిడ్డలకు పెండ్లి చేస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే రూ.లక్షా116 మంజూరవుతుంది. ఈ పథకాలు పేదల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో మొత్తం 1,920 మంది లబ్ధిదారులకు రూ.19.20కోట్ల చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఇంకా దరఖాస్తులు వివిధ సాంకేతిక కారణాలతో మరో 23 పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. వాటిని కూడా సత్వరం లోపాలను సరిచేయాలని సంబంధిత అధికారులను ఇదివరకే ఎమ్మెల్యే ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా తమ తల్లిదండ్రులు ఎంతో లబ్ధిపొందారని పెండ్లీలు చేసుకున్న యువతులు కొల్లాపూర్ మండలం సింగవట్నం గ్రామానికి చెందిన ఆడెపోగు చంద్రకళ, చుక్కాయపల్లి గ్రామానికి చెందిన దేవని మహేశ్వరి వెల్లడించారు. తమకు ఆరునెలల కిందట వివాహాలు జరిగాయి. కల్యాణలక్ష్మి డబ్బులు కూడా అందాయని వారు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ను జీవితంలో మరువం
మాలాంటి పేదోళ్ల ఆడబిడ్డల పెండ్లి ల కోసం కేసీయారయ్యా పెట్టిన కల్యాణలక్ష్మి మాకు కొండంత బ లం. నా పెద్దబిడ్డకు పెండ్లి చేసిన. ఎమ్మెల్యే బీరం సారూది మా ఊరే. వారి పుణ్యాన నాకు మొన్న ఎమ్మె ల్యే సారూ చెక్కు ఇచ్చిండ్రు. ఆ డబ్బులు మాకు కుటుంబానికి చాలా ఆసరా అయ్యింది.
– బాలమణెమ్మ, సింగవట్నం, కొల్లాపూర్ మండలం
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
కేసీయారయ్యాకు రుణపడి ఉం టా. నాది పేద దళిత కుటుంబం. నాభర్త చనిపోయిండు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ నా పెద్ద కుమార్తె మహేశ్వరిని మా బంధువుల పోరోనికిచ్చి పెండ్లి చేశాను. కల్యాణలక్ష్మి చెక్కు తీసుకున్నా. నాకు మగదిక్కులేనందుకు ఈ డబ్బులు ఎంతో మేలు.
– దేవని చిట్టెమ్మ, చుక్కాయపల్లి, కొల్లాపూర్ మండలం