
మహబూబ్‌నగర్, మే6(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్ల గ్రామంలో ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేక చాలా మంది వలసలు వెళ్లారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా జనాభా 3247 మంది కాగా.. ప్రస్తుతం సుమారు 4500వేల వరకు జనాభా ఉండవచ్చు. నివాస గృహాలు 710 ఉన్నాయి. ఒకప్పుడు తాళం వేసి కనిపించే ఇండ్ల సంఖ్య 30 శాతానికి పైగానే ఉండేది. ఇప్పుడు మాత్రం 100శాతం ఇండ్లల్లో నివాసముంటున్నారు. ఒకప్పుడు ఒక పంటకే ఆకాశం వైపు చూడాల్సి ఉండేది. ఇప్పుడు తప్పకుండా రెండు పంటలు పండుతున్నాయి. వ్యవసాయం బాగయ్యే వరకు జనం ఆర్థిక పరిస్థితి సైతం మెరుగైంది.
ఎంజీకేఎల్ఐ నీటి రాకతో..జలకళ
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 29వ, ప్యాకేజీ ద్వారా కల్వకుర్తి చివరి ఆయకట్టు వరకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి మంగనూరు వద్ద ఘనపురం బ్రాంచ్ కెనాల్ నుంచి మద్దిగట్లకు కాలువ, గొలుసుకట్టు చెరువుల ద్వారా సాగునీటిని తరలించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహకారంతో స్థానిక ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, రైతులు కలిసి రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడి కృష్ణా జలాలు తమ పొలాల్లోకి పారేందుకు గాను కృషి చేశారు. ప్రభుత్వం భూసేకరణ చేశాక మిగిలిపోయిన పనులను సుమారు 6 నెలల పాటు కష్టపడి పూర్తి చేశారు. ఘనపురం కాలువ నుంచి సుమారు 9.5 కి.మీ మేర పనులు పూర్తి అయ్యాయి. ఎట్టకేలకు 2018 డిసెంబర్ 5న గ్రామంలోని మద్దిఖాన్ చెరువుకు కృష్ణా జలాలు తరలివచ్చాయి. చెరువు నిండింది. చుట్టూ ఉన్న గంటి కుంట, తుమ్మల కుంట, యాదిరెడ్డి కుంట కూడా నిండాయి. ఏళ్ల తర్వాత అలుగు పారింది. గ్రామంలో 1300 ఎకరాలుంటే సుమారు 1200 ఎకరాలు సాగులోకి వచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, కడప వంటి దూర ప్రాంతాలకు వలస వెళ్లిన అనేక మంది తిరిగి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో కూలీలుగా పనిచేసిన రైతులు తిరిగి తమ సొంత పొలాల్లో వ్యవసాయం చేస్తూ దర్జాగా జీవిస్తున్నారు. గ్రామంలో జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి.
ఈదమ్మ జాతర
30,40 ఏండ్ల కిందట మద్దిగట్ల గ్రామంలో ఈదమ్మ జాతర ఎంతో వైభవంగా జరిగేది. పిల్లాపాప నూతన దుస్తులు ధరించి పండుగలో పాల్గొనేవారు. బంధుమిత్రులను ఆహ్వానించి యాటలు కోసి దావత్ ఇచ్చేవారు. అయితే క్రమంగా చెరువు ఎండిపోయి, బావుల్లో చుక్క నీరులేక, బోర్లు పనిచేయక కరువు ఏర్పడింది. ఉపాధి కోసం తలో దిక్కు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దాంతో గ్రామంలో ఈదమ్మ జాతర జరిగినా మొక్కుబడిగా మాత్రమే చేసేవాళ్లు. అయితే ఇప్పుడు కృష్ణా జలాలు వచ్చాక గ్రామంలోని భూములన్నీ మంచి పంటలు పండుతున్నాయి. రైతులు, రైతు కూలీల చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి. అందుకే ఖర్చుకు ఎవరూ వెనకాడటంలేదు. గత నెల 30వ తేదీన జరిగిన ఈదమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారుల విన్యాసాలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మత్స్య, పాడి పరిశ్రమ పెరిగింది. గొర్రెలు, మేకల పెంపకంతోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. రైతులు ఆర్థికంగా బాగు పడ్డారు. కిరాణ కొట్లు, మెడికల్ షాపులు వెలిశాయి. చిన్న చిన్న టీకొట్లు పెట్టుకుని కూడా పలువురు ఉపాధి పొందుతున్నారు. సాగునీరు రావడం వల్లే ఇదంతా సాధ్యమైందని మద్దిగట్ల గ్రామస్తులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ రైతుల జీవితాలనే మార్చేశారు..
ఒకప్పుడు రైతు కుటుంబం అంటేనే అప్పులు, ఆత్మహత్యలు గుర్తుకు వచ్చేవి. కానీ నేడాపరిస్థితి లేదు. కల్వకుర్తి మెయిన్ కెనాల్ నుంచి ఘనపురం బ్రాంచ్ కెనాల్ పనులకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమచిచ్చారు. భూసేకరణ సైతం త్వరగా పూర్తయింది. పనులు ప్రారంభించేందుకు ఆలస్యం అవ్వకుండా రాత్రి పగలూ తేడా లేకుండా యంత్రాలతో పనులు చేయించాం. 9.5 కి.మీ కాలువ నిర్మాణం పూర్తి చేసుకుని మద్దిగట్ల మద్దిఖాన్ చెరువును కృష్ణానీటితో నింపాం. భూసేకరణకు సైతం రైతులంతా స్వచ్ఛందంగా సహకరించారు. కాలువ పనులు ప్రారంభించేందుకు ఇంకా సమయం పట్టే పరిస్థితి ఉండటంతో మేమే ఎమ్మెల్యే సహకారం, మా స్వంత నిధులు రూ. 70లక్షలతో కాలువ పనులు పూర్తి చేశాం. ఒట్టిపోయిన చెరువుకు జలకళ వచ్చిన తర్వాత మా కష్టం మర్చిపోయాం. మా గ్రామం నుంచి వలస వెళ్లిన సుమారు 100 మందికి పైగాకూలీలు తిరిగి వచ్చి స్థానికంగానే వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతుల జీవితాలనే మార్చేశారు.