జోగులాంబ గద్వాల : జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్లో ఎంపీడీవోలతో హరితహారం కార్యక్రమం పై సమీక్ష సమావేశం, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగించాలని జిల్లాకు ఇచ్చిన 13 లక్షల టార్గెట్ కంటే ఎక్కువగా మొక్కలు నాటి జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆమె సూచించారు. గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు అనుకుంటే జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా మార్చగలరన్నారు.
అన్ని మండలాలలో పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ధరూరు, మానవపాడు పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హరితహారం కార్యక్రమం ఏ విధంగా జరిగిందని ఆరా తీశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అటవీ శాఖ కన్జర్వేటర్ క్షితిజ, ఐఎఫ్ఎస్, డీపీవో శ్యాంసుందర్, డీఆర్డీఏ ఇంచార్జి నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు.