విదేశంలో చిక్కుకున్న వైద్య విద్యార్థులు
యుద్ధ వాతావరణంతో భయబ్రాంతులు
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
రప్పించేందుకు సర్కార్ చర్యలు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉక్రెయిన్‌లో మన విద్యార్థులు చిక్కుకున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ యుద్ధం జరుగుతుండగా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఎంబీబీఎస్ విద్యనభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఆ దేశంలో విమానాలను రద్దు చేయడంతోపాటు బాంబుల వర్షం కురుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది.
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కు వైద్య విద్య కోసం వెళ్లిన మన దేశ విద్యార్థులు చిక్కుకుపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చాలా మం ది తిరిగి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నా.. చివరి నిమిషంలో విమాన సర్వీసులను రద్దుచేశారు. దీంతో గత్యంతరం లేక చాలా మంది విద్యార్థులు తిరిగి కళాశాలలకు వెళ్లిపోయారు. పలువురు ఇంకా ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారని, ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని వి ద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిణామాలతో తమ పిల్లలకు ఏమవుతుందోననే బెంగ పడుతున్నారు. ఉక్రెయిన్‌లోని విద్యార్థులు, ఉద్యోగుల వివరాలను తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల ద్వారా ఆయా జిల్లాల్లో పోలీసులు సేకరిస్తు న్నారు. నమోదు చేసుకున్న వివరాలను డీజీపీ కార్యాలయం ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు, ఉద్యోగు లు, విహార యాత్రలకు వెళ్లిన వారు ఎవరున్నా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రయాణ చార్జీలను సైతం భరించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉన్నది.
ఆందోళనలో విద్యార్థులు..
కోయిలకొండకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహ్మద్ పాషా కుమారుడు గౌస్ పాషా ఉక్రెయిన్‌లోని చెర్నివ్సిలోని బుకేవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నాడు. ఈ కళాశాల ఆ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది. దాడుల సమాచారం నేపథ్యంలో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. గురువారం ఆ దేశ రాజధాని కీవ్‌కు 5 కి.మీ. దూ రంలో ఉండగా.. రష్యన్ దళాలు కీవ్ ఎయిర్‌పోర్టుపై మిస్సైళ్లతో దాడులు చేశాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న బస్సును వెనక్కి పంపించారు. కీవ్ నుంచి ఆ దేశ ప్రజలతోపాటు విదేశీయు లు సురక్షితంగా భావిస్తున్న పశ్చి మ ప్రాంతాలకు వెళ్తుండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. వేలాది వా హనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్లు మన విద్యార్థులు చెబుతున్నారు. గంటల కొద్దీ బస్సుల్లోనే గడుపుతున్నామని.. కనీసం భోజనం చేసేందుకు కూడా అవకాశం లేక చిప్స్ వంటివి తింటున్నట్లు చెబుతున్నారు. ఎంబసీ వాళ్లు మన విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు పలువురు తెలిపారు. ఇక కీవ్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా.. అక్కడ ఉన్న విద్యార్థులు ఇండ్లకే పరిమితమైనట్లు తెలిపారు. ఆందోళనకరమైన ప్రాంతాల్లో విద్యార్థులకు బంకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు సమాచారమిచ్చారు. ‘ఉక్రెయిన్‌లో ఉండిపోయిన వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలి’ అని కోయిలకొండకు చెందిన మహ్మద్ పాషా కోరారు.
వైద్య విద్య కోసం విదేశాలకు..
మన దేశంలో ఎంబీబీఎస్ విద్యకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఏటా సుమారు 16 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తారు. ఇందులో దాదాపు సగం మంది అర్హత సాధిస్తున్నారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 సీట్లు ఉన్నాయి. కానీ ఏటా 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధిస్తున్నట్లు అంచనా. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. ఈ తరుణంలో వి దేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది చైనా, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాలతోపాటు సోవియట్ దేశాలైన రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, జార్జియా, కిర్గిజిస్తాన్, అర్మేని యా, బెలారస్, మోల్డోవా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అనేక కన్సల్టెన్సీలు పనిచేస్తున్నాయి. దాదాపుగా ఇదో పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతున్నది. కొన్ని దేశాల్లో మాత్రం సౌకర్యాలు, చక్క ని విద్యా బోధన, ఫీజు కూడా అందుబాటులో ఉంటున్నాయి. మన దేశం లో ప్రైవేటులో ఎంబీబీఎస్ చేసేందుకు ఏటా రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఉక్రెయిన్‌లో ఆరేండ్ల కోర్సుకు రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల లోపు (హాస్టల్ వసతి కాకుండా) పూర్తవుతున్నది. ఈ తరుణంలో ఏటా ఉక్రెయిన్‌లో వైద్య విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న ది. ప్రస్తుతం అక్కడ సుమారు 18 వేల మంది భారతీయ విద్యార్థులుండ గా.. అందులో దాదాపు రెండు వేల మందికిపైగా తెలంగాణ వారే ఉంటారని అధికారుల అంచనా. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సు మారు రెండు వందల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
క్షేమంగానే ఉన్నాం
గట్టు, ఫిబ్రవరి 25 : మండలకేంద్రానికి చెందిన బుదారపు లీలావతి, లక్ష్మీనారాయణ కుమారుడు రాహుల్ ఉక్రెయిన్‌లోని బుకోవినియన్ (బీఎస్ఎంయూ) మెడికల్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్వదేశం వచ్చేందుకు చెర్నివిస్టి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా.. ఆ ప్రాంతాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయని తెలిసి హాస్టల్‌కు తిరిగి వెళ్లాడు. హాస్టల్‌కు వెళ్లేందుకు ట్రాఫిక్ కారణంగా గంటలకొద్దీ సమయం పట్టింది. శుక్రవారం ఉక్రెయిన్ నుంచి రాహుల్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. క్షేమంగానే ఉన్నానని, భయాందోళన చెందొద్దని రాహుల్ తెలిపాడు.
విమాన సర్వీసులు నిలిపివేత
జడ్చర్ల/జడ్చర్ల టౌన్, ఫి బ్రవరి 25 : జడ్చర్లలోని సంతోష్‌నగర్‌కు చెందిన కొ మ్ము సుజాత, శ్రీనివాసు లు కూతురు యోజిత ఉక్రెయిన్‌లోని ఒడెస్సా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నా లుగో సంవత్సరం విద్యనభ్యసిస్తున్నది. అక్కడ మి త్రులతో కలిసి ఇంటిని అద్దె కు తీసుకొని ఉంటున్నది. అయితే, వారం కిందట ఇండియాకు వ చ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నా.. ఎయిర్‌పోర్టులు మూసివేయడం తో అక్కడే ఉండిపోయిందని యోజిత తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని మన దేశానికి చేర్చాలని వారు కోరుతున్నారు. అలాగే జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి గ్రామానికి చెందిన స్పుత్నిక్రెడ్డి ఉక్రెయిన్‌లోని డినిప్రో మెడికల్ ఇన్స్టిట్యూట్లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, తాను క్షేమంగానే ఉన్నట్లు తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. విద్యార్థి తాత రాఘవరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
అనుకూలించని పరిస్థితులు
ఇటిక్యాల, పిబ్రవరి 25 : మండలంలోని కొండేర్ గ్రామానికి చెందిన అశోక్ ఉక్రెయిన్‌లో జెప్రోబిమా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ‘యుద్ధ వాతావరణం ఉండడంతో స్వదేశానికి వచ్చేందు కు పరిస్థితులు అనుకూలించడం లేదు. పెబ్బే రు, రాయిచూర్, ఏపీ, మహారాష్ట్రకు చెందిన వి ద్యార్థులతో కలిసి ఉంటున్నాను’ అని అశోక్ శు క్రవారం చెప్పినట్లు అతడి బావ జయరాం తెలిపారు. ఇప్పటివరకు కళాశాలలో భయానక పరిస్థితులు లేవని, మున్ముందు సంక్లిష్టంగా మారతాయేమోనని విద్యార్థి తాత బుచ్చన్న, అవ్వ శంకరమ్మ ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు
దామరగిద్ద, ఫిబ్రవరి 25 : మండలకేంద్రానికి చెందిన ఉపాధ్యాయు డు కృష్ణకుమార్ కుమార్తె మనోజ్ఞ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నది. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉందని, సురక్షిత ప్రదేశాలకు పంపేందుకు భారత రాయబారి కార్యాలయం సిబ్బంది ప్ర యత్నాలు చేస్తున్నారని మనోజ్ఞ చెప్పినట్లు విద్యార్థిని తండ్రి తెలిపారు. సైబర్ కారణాలతో ఫోన్లు పనిచేయకపోవచ్చని చెప్పిందన్నారు.
భయాందోళన వద్దు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 : నాగర్‌కర్నూల్ పరిధిలోని దేశిటిక్యాల గ్రామానికి చెందిన మాధవి, రమేశ్‌రెడ్డి కుమారుడు సాయిరాంరెడ్డి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయిరాంరెడ్డి శుక్రవారం తల్లిదండ్రులతో మాట్లాడాడు. ‘యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు’ అని విద్యార్థి తెలిపారు.
ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు
పెద్దమందడి, ఫిబ్రవరి 25 : మండలంలోని మనిగిల్ల గ్రామానికి చెందిన కొండా రవీందర్‌రెడ్డి కుమారుడు అభిలాష్‌రెడ్డి ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. ‘క్షేమంగా ఉన్నా ను. ఉక్రెయిన్‌లో ఉన్న వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివరాలు సేకరిస్తున్నారు. రోడ్డు మార్గంలో సరిహద్దుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.’ అని అభిలాష్‌రెడ్డి చెప్పినట్లు తండ్రి రవీందర్‌రెడ్డి తెలిపాడు.