మరికల్, సెప్టెంబర్8: ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పనిచేయని అధికారులు ఉద్యోగాలు విడిచి ఇంటికి వెళ్లాలని ఎమ్మెల్యేలు ఎస్.ఆర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులు సహకరించి గ్రామాలను అభివృద్ధి పర్చుకోవాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీకళారాజవర్ధన్రెడ్డి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కొవిడ్ వైరస్ కారణంగా పాఠశాలలు 16నెలల తర్వాత ప్రారంభమయ్యాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేజీబీవీ పాఠశాల నూతన భవన నిర్మాణం త్వరలోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు అన్నారు. ఉపాధిహామీ పథకంలో మాధవర్ గ్రామంలోని కోయిల్‌సాగర్ లింక్ కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం విషయంలో సర్పంచ్, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
మినీ ట్యాంక్ బండ్‌కు ఇంకెన్నాళ్లు..
పేట నియోజకవర్గంలో మరికల్లో పెద్దచెరువు వద్ద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారని నీటిపారుదల శాఖ అధికారులపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలు గడిచినా పనులు పూర్తికాకపోతే ఎలా అని ప్రశ్నించారు. చెరువుల ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద చెరువును ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఈమేరకు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలు సూచించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌనిసురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ధన్వాడ, తీలేరు సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, రాజేందర్‌గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.