నాగర్‌కర్నూల్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ)/కల్వకుర్తి/చారకొండ : హుజూరాబాద్ తరహాలోనే నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోనూ దళిత బంధు పథకం దళితులకు వరంలా మారనున్నది. ఈ మండలం నూతన జిల్లాల ఆవిర్భావంతో పాటుగా.. వంగూరు-వెల్దండ మండలాల్లోని 7 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా మండలంలో ఏర్పాటైంది. ఆ తర్వాత తండాలను పంచాయతీలుగా మార్చడంతో ప్రస్తుతం 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రెవెన్యూ గ్రామాలను కలిపితే మండలంలో 12 వందల వరకు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 3,743 మంది దళితులు నివసిస్తున్నారు. అన్ని కులాల కుటుంబాలు 4,898 ఉండగా..20,550 మంది జనాభా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 3,743 మంది కాగా ఎస్టీలు 4,690 మంది. ఈపథకంతో రూ.10లక్షల ఆర్థిక సాయం అందనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఈ మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేయడంతో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
ఊరూరా సంబురాలు
దళితబంధుకు చారకొండను ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఊరూరా సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగం మండలంలో దళిత కుటుంబాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించనున్నది. దీనికోసం త్వరలో గ్రామాల వారీగా సర్వే చేపట్టనున్నారు. దీని ద్వారా దళితుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించి విధానాలను ఖరారు చేస్తారు. ఆయా దళిత కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు, ఏయే ఉపాధి చేసుకునేందుకు ఆసక్తి, అర్హతలు కలిగి ఉన్నారనే వివరాలను ఆరా తీస్తారు. దళితుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను ఏర్పాటు చేసింది. హాస్టళ్లలో ఉచిత వసతి కల్పిస్తున్నది. ఇక విదేశాల్లో చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. కార్పొరేట్ కళాశాలల్లోనూ ఉచిత చదువులను కల్పిస్తున్నది. అలాగే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం రుణాలను మంజూరు చేస్తుంది. ఆడ పిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, కులాంతర వివాహాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నది.
దళిత రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు పాడి గేదెల పంపిణీతో పాటు భూ అభివృద్ధి, బోర్లు వేయించడం, పందిరి కూరగాయల వంటి పథకాలను అమలు చేస్తున్నది. అదే విధంగా దళిత వాడల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. సీసీరోడ్లు వేయడంతో పాటుగా మురుగుకాల్వలు వేయడం, విద్యుత్ బల్బులను ఏర్పాటు చేయనున్నది. ఇందులో భాగంగా చారకొండ మండలంలోనూ 10,590 మీటర్ల పొడవైన సీసీ రోడ్ల పనులకు రూ.4.23 కోట్లతో అంచనాలు రూపొందించారు. అలాగే 5,350 మీటర్ల మురుగు నీటి కాల్వలకు రూ.1.60 కోట్లతో, విద్యుత్ స్తంభాల కనెక్షన్లకు రూ.90 వేల చొప్పున మండలంలోని దళిత వాడల్లో దాదాపు రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఇలా దళిత వాడల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో సాగుతున్న క్రమంలో చారకొండ మండలంలో రాబోయే కాలంలో దళితులంతా ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకోనున్నారు.
వెనుకబాటు ఎందుకంటే..?
చారకొండ మండలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చివరి గ్రామంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నల్లగొండ జిల్లాకు ఈ గ్రామం (గతంలో హామ్లెట్ గ్రామమైన మర్రిపల్లితో కలిపి) సరిహద్దు గ్రామం. సీఎం కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి చేరింది. ప్రస్తుతం కూడా జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో, అచ్చంపేటకు 40 కిలో మీటర్లు, కల్వకుర్తికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఈ మండలం రెవెన్యూ పరంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గం ప్రకారం అచ్చంపేట కిందకు వస్తుంది. పూర్వ వంగూరు మండలంలో ఉన్న ఈ గ్రామం వెల్దండ-వంగూరులోని నాలుగు గ్రామాలతో కలిసి కొత్త మండలంలా ఉద్భవించింది. రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చగా ఇప్పుడు 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నాలుగు గ్రామాలకు మాత్రమే ఎంజీకేఎల్ఐ(డీ-82కాల్వ) ద్వారా సాగునీరు అందుతున్నది.
ఇంకా సాగునీరు అందని గ్రామాలు ఉన్నాయి. డిండి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. రహదారి సౌకర్యం కూడా నేరుగా లేదు. ఏమైనా పనుల కోసం అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ప్రస్తుతం చేపడుతున్న కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి చారకొండ నుంచి వెళ్తుంది. ఇది పూర్తయితే రవాణాపరంగా మెరుగైన సేవలు అందనున్నాయి. కాగా ఇక్కడ గౌడ కులస్తులు ప్రధానంగా ఉన్నారు. అందువల్ల గీత వృత్తితో పాటుగా పత్తి పంట ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. సాగునీరు అందకపోవడంతో ఇంకా మండలం వ్యవసాయంలో వెనుకబడే ఉన్నది. విద్య, వైద్యంలాంటి ఇతర పనుల కోసం పట్టణ ప్రాంతాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి, ప్రస్తుత జిల్లాతో పాటుగా అసెంబ్లీ, రెవెన్యూ కేంద్రాలకు దూరంగా ఉండటం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకంగా మారింది.
నిరంతరంగా ‘దళిత బంధు’
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్1: అట్డడుగున ఉన్న దళితులను సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ అమలుకు శ్రీకారం చుట్టారని ఇది నిరంతరంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు చారకొండను ఎంపిక చేయడంతో హర్షం వ్యక్తంచేశారు. సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రతిపక్షాలు మాత్రం పథకాలను అమలుకానివ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. గ్రామ గ్రామానా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమై జెండా పండుగను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. జెండావిష్కరణకు కావాల్సిన సామగ్రిని అందించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం పాల్గొన్నారు.
మా జీవితాల్లో వెలుగులు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మా సమ స్యలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలె. సీఎం కేసీఆర్ దళితులకు మంచి శానా చేస్తుండు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేమంతా జీవితాంతం సార్‌కు రుణపడి ఉంటాం.
అన్ని వర్గాలకు సంక్షేమం
అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారు. హుజూరాబాద్‌లోనే కాదు రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేస్తారనే నమ్మకం ఏర్పడింది. చారకొండ మండలానికి దళిత బంధు అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది.
దళితుల అభ్యున్నతే లక్ష్యం
వెనుకబడిన దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. ‘దళిత బంధు’ ద్వారా జీవనోపాధి పొందుతారు. పథకం అమలుకు చారకొండను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్, విప్ గువ్వల బాలరాజకు ప్రత్యేక కృతజ్ఞతలు.
దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్
ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’తో దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం దళితులందరికీ వస్తుంది. వెనుకడిన వర్గానికి న్యాయం చేయడం ఆనందంగా ఉన్నది.
చారగొండను ఎంపిక చేయడం హర్షణీయం
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ): దళితబంధు అమలుకు చారగొండ మండలాన్ని ఎంపికచేయడంతో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాదన్న తెలంగాణను సాధించిన కేసీఆర్, వీలుకాదన్న దళితబంధు పథకాన్ని అమలుచేసి చూపిస్తారని అన్నారు. తెలంగాణ సాధిస్తామని చెప్పినప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వారే తెలంగాణ అభివృద్ధిని అనుమానించారని, వీరే దళితబంధుపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా విజయవంతమవుతున్నదని, వాటి మాదిరిగానే దళితబంధు పథకం సక్సెస్ అవుతుందన్నారు.
సీఎం నిజమైన దళిత పక్షపాతి
సీఎం కేసీఆర్ నిజమైన దళిత పక్షపాతిగా నిరూపించుకొన్నారు. ఈ పథకంతో దళితులు రాబోయే కాలంలో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతి సాధిస్తారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చారకొండను ఈ పథకంలో చేర్చినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు.
సీఎం హయాంలో దళితులకు స్వర్ణయుగం
సీఎం కేసీఆర్ హయాంలో దళితులకు స్వర్ణయుగం రాబోతోంది. దేశ చరిత్రో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్‌దే. నా నియోజకవర్గంలోని మండలాన్ని ఎంచుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నది. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకమనే ప్రతిపక్షాల తప్పుడు మాటలను దళితులు, ప్రజలంతా గుర్తించాలి. మారుమూల మండలమైన చారకొండను సీఎం సహకారంతో రాబోయే రెండేళ్లలో అభివృద్ధిలో ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేలా కృషి చేస్తా.