గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 1 : చిక్కకుండా.. దొరక్కుండా నాలుగేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ విలేకరులకు వెల్లడించారు. అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో నరేందర్‌రెడ్డి ఇంట్లో గత నెల 9న అదే గ్రామానికి చెందిన గొల్ల శ్రావణ్ కుమార్ ఇంటికి తాళం వేయగా.. తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 48.40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.60 వేల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచారు. కాగా దొంగిలించిన ఆభరణాలను శ్రావణ ఉప్పల గ్రామంలోని ఓ దుకాణంలో తాకట్టు పెట్టి రూ.1,57,300 తీసుకున్నాడు. ఈ నగదులో కొంత మొత్తం అప్పులకు చెల్లించాడు. మిగిలిన దాంతో జల్సా చేశాడు. అయితే విచారణలో శ్రవణ్‌పై అనుమానం వచ్చింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్తున్నాడన్న సమాచారం మేరకు సిబ్బంది సాయంతో వెంకటాపురం స్టేజీ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బంగారు ఆభరణాలను సైతం రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే మరో ఘటనలో నాలుగేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ తెలిపారు. 2017లో జనవరి 23న శాంతినగర్‌లోని సురేష్ జ్యువెల్లరీ నుంచి 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలను చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టగా.. ఇటిక్యాల మండలానికి చెందిన బోయ రాధాకృష్ణ, అయిజ మండలానికి చెందిన బోయ మద్దిలేటిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. వారిద్దరూ కలిసి చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను వారికి అంతకుముందు జైళ్లో పరిచయమైన రవీందర్‌రెడ్డి స్నేహితుడు ఆంజనేయులుతో కలిసి కొంత తీసుకొని.. మిగిలిన సొత్తును ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన గంగన్నకు విక్రయించారు. పాత నేరస్తులు ఇచ్చిన సమాచారం మేరకు నాలుగేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న గంగన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద ఉన్న రూ.2 లక్షల విలువ చేసే 40 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. రెండు కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించినట్లు చెప్పారు. వారం కిందట ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. వీరిపై జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను ఛేదించిన శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు శ్రీహరి, ముత్తయ్య, ఏఎస్సైలు ముత్తురాజు, సిబ్బంది రాజవర్ధన్‌రెడ్డి, రంజిత్ కుమార్, రామకృష్ణ, వెంకప్ప, దానియేలు, విజయరాజు, యాకుబ్, ఆంజనేయులు, శ్రీనివాసులను ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు శ్రీహరి, ముత్తయ్య పాల్గొన్నారు.