దేవరకద్ర రూరల్, ఆగస్టు 25 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గుడిబండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించడంతోపాటు అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రతి గ్రామానికీ బీటీరోడ్లు నిర్మించడంతోపాటు సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలను శుభ్రపర్చడంతోపాటు వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, నాయకులు కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.