అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
రూ.3.5కోట్లతో బీటీరోడ్డు పనులకు భూమిపూజ
ఉండవెల్లి, మార్చి 20: గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్పని చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని కలుగోట్ల నుంచి పోతులపాడు స్టేజీ వరకు రూ.3.5కోట్లతో నిర్మిస్తున్న బీటీరోడ్డు పనులను ఎమ్మెల్యే ఆదివారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్డుమార్గం ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలోని ప్రతిపల్లె, తండాకు బీటీరోడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాములమ్మ, వైస్‌ఎంపీపీ బీసమ్మ, ఎంపీటీసీలు సుంకన్న, రాజు, టీఆర్ఎస్ నాయకులు తేజ, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మజీద్మియా తదితరులు పాల్గొన్నారు.
నాసిరకంగా బీటీరోడ్డు పనులు
కాంట్రాక్టర్ నాసిరకంగా బీటీరోడ్డు పనులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాల వరకు రోడ్డు నిర్మించాలి కానీ, 95మీటర్లు రోడ్డు నిర్మించకుండా మధ్యలో వదిలేయడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన అధికారులు బీటీరోడ్డు నాణ్యత లేకుండా చేస్తున్నారన్నారు. బీటీరోడ్డు నాణ్యతపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
పల్లెల్లో రోడ్లకు మహర్దశ
గట్టు, మార్చి 20: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లోని సీసీ రోడ్లకు మహర్దశ కలిగిందని ఎంపీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో ఉపాధిహామీ నిధులు రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ప్రభుత్వంలో పల్లెలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్రతి గ్రామంలో మార్చి నెలాఖరుకల్లా సీసీరోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో పీఎస్ కృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ శంకరన్న, మాజీ ఎంపీటీసీ బుడ్డప్ప, నాయకులు రామాంజనేయులు, శివప్ప, మల్లేశ్, హనుమంతు, గూరన్న పాల్గొన్నారు.