నేటినుంచి ప్రారంభం
హాజరుకానున్న ఉపాధ్యాయులు
గద్వాలటౌన్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేయనుంది. ఈ మేరకు ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించింది. ఇందుకుగానూ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తయింది. ఆ శిక్షణకు జిల్లా నుంచి 8మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సోమవారం నుంచి జిల్లాలో శిక్షణ ప్రారంభించనున్నారు. శిక్షణకై 51మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. శిక్షణ పూర్తయిన 51మంది ఉపాధ్యాయులు తర్వాత మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. శిక్షణ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో కొనసాగుతుంది. మొత్తం మూడు విడుతల్లో శిక్షణ కొనసాగుతుంది. మొదటి విడుతలో భాగంగా సోమవారం నుంచి 25వరకు అయిదు రోజులపాటు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చేలా అధికారులు కార్యాచరణ చేశారు. మిగతా శిక్షణ 28, వచ్చే 4వ తేదీల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సబ్జెక్టుల వారీగా విభజించి శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీటీలకు ఈ నెల 14నుంచి 19వరకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. ఈనెల 21 నుంచి గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్ష శిక్షణ పూర్తయిన తర్వాత రెండు వారాలపాటు ఆన్లైన్ శిక్షణ ఇస్తారు.
ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా..
వచ్చే ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమం ప్రారంభం కానున్న దృష్ట్యా ఉపాధ్యాయుల్లో ఆత్వవిశ్వాసాన్ని పెంచేలా శిక్షణ ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో శిక్షణను పొందిన ఉపాధ్యాయుడు రవికుమార్ విద్యార్థులకు ఆంగ్లంలో బోధించేందుకు అన్నివిధాలా సన్నద్ధం చేయడమే శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మానసికంగా అన్నివిధాల సన్నద్ధమయ్యేందుకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయుల్లో ఆలోచనా శక్తి పెంచేందుకు, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు శిక్షణ తోడ్పాటు అవుతుందని తెలిపారు.