ప్రభుత్వ ప్రోత్సాహంతో కార్మికులకు చేతినిండా ఉపాధి
ఆకట్టుకుంటున్న హస్తకళా మేళా
అయిజ, మార్చి 20: చేనేత వస్ర్తాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతున్నది. ప్రస్తుతం చేనేత వస్ర్తాలపై రాజకీయ నాయకులు, యువత, మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. చేనేతకు చేయూతనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, చేనేత, జౌళీశాఖల మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత వస్ర్తాలను ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, జౌళీశాఖకు ప్రాధాన్యత కల్పిస్తున్నది. చేనేత కార్మికులకు కడుపునిండా పని కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరలను రూ.350 కోట్లతో సిరిసిల్లలోని మరమగ్గాలపై ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నది. ప్రస్తుతం పురుషులు, స్త్రీలు చేనేత వస్ర్తాలపై మక్కువ పెంచుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు చేనేత కార్మికులు నేసిన షర్టులు, పంచెలు, టవళ్లను వినియోగిస్తున్నారు. మేళాలో కొనుగోలు చేస్తున్న వస్తువులను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అయిజలోని రాయిచూర్ చౌరస్తాలోని వేంకటేశ్వర ఫంక్షన్హాల్లో గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత హస్త కళామేళా ప్రదర్శన, అమ్మకములు ఆకట్టుకుంటున్నాయి. మేళాలో ప్రధానంగా గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, చీరాల వంటి డ్రెస్ మెటీరియల్స్ అమ్మకాలు జరుపుతున్నారు. కాటన్ డ్రెస్లు, షర్టులు అందుబాటులో ఉంచడంతో జనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
చేనేత, హస్తకళలను ఆదరించాలి..
ప్రజలు చేనేత వస్ర్తాలు, హస్తకళలను ఆదరించాలి. చేనేత దుస్తులు, వస్తువులను కొనుగోలు చేయడంతో ఎంతో మంది చేనేత కార్మికులకు చేయూతనందించినవారవుతారు. నేతన్నలు నేసిన చీరలు, కాటన్ దుస్తులు, చేనేత వస్ర్తాలను ధరించి వారికి ఉపాధి కల్పించాలి.
– రామచంద్రయ్య, మేనేజర్, గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ