పురుగుల మందు డబ్బాతో యువకుడి ఆందోళన
అచ్చంపేట రూరల్, మార్చి 20 : పోలీసులు అకారణంగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకున్నది. అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మత్రునాయక్ మాట్లాడుతూ తనను అకారణంగా చిత్రహింసలకు గురిచేయడంతోపాటు తప్పుడు కేసు బనాయించి ఏఎస్సై అంజయ్య, కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌స్టేషన్ ముందు నిరసన చేపట్టాడు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్సై ప్రదీప్‌కుమార్ మత్రుకు సర్దిచెప్పి పురుగుల మందు డబ్బాను తీసుకున్నాడు. ఈ విషయాన్ని సీఐ అనుదీప్ దృష్టికి తీసుకెళ్లగా అతను ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అంతకుముందు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాధితులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సై ప్రదీప్‌ను వివరణ కోరగా శనివారం అచ్చంపేట పట్టణంలో వాహనాల తనిఖీల్లో భాగంగా బైక్‌పై మత్రును ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ లేకపోవడంతో ప్రశ్నించగా.. అతడు దురుసుగా పోలీసులతో ప్రవర్తించడంతోపాటు అతన్ని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.