మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు : ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 25 : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. వాహనాలకు నెం బర్ప్లేట్ లేకుండా ప్రయాణించడం నేరమన్నా రు. నెంబర్ప్లేట్పై అసభ్యకరమైన రాతలు రాయడం, నెంబర్ కనిపించకుండా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ప్లేట్ పెట్టకపోవడంవల్ల నేరగాళ్లకు అవకాశం కల్పించినవారమవుతామన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. మైన ర్లు వాహనాలు నడిపితే కుటుంబ పెద్దలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రయాణం సాఫీగా సాగడానికి రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల సాయంతో పోలీస్ కమాండో కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, జరిమానా విధింపునకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా నెంబర్ప్లేట్ లేకుండా బైకులపై తిరుగుతూ పట్టుబడిన 70మంది యువకులకు ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్సై గోపాల్ పాల్గొన్నారు.