శ్రీశైలంలో ఉప్పొంగిన భక్తిభావం
కనులపండువగా మల్లన్న రథోత్సవం
తెప్పోత్సవంపై విహరించిన ఆదిదంపతులు
కైలాసాన్ని తలపించిన శ్రీగిరి
లక్షలాదిగా తరలొచ్చిన భక్తులు
వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, మార్చి 2 : ముక్కంటి ఆలయం భక్తజన సాగరమైంది.. కైలాసాన్ని తలపించేలా శ్రీగిరి వీధులు కిక్కిరిశాయి. శంభో శంకరా..శంభో శివ శంభో.. హరోం ‘హర’.. మనో‘హర’.. ఓంకార నాదంతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య రథంపై భ్రామరీ మల్లన్న స్వామి దర్శనంతో లక్షలాదిగా తరలొచ్చిన భక్తులు తన్మయత్వం చెందారు. మదినిండా మనోహరుడిని స్మరించుకున్నారు. అలాగే తెప్పోత్సవంపై ఆదిదంపతులు విహరించారు. భక్తులు ఈ ముగ్ధమనోహర దృశ్యాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న చెప్పారు. బుధవారం సాయంత్రం గంగాధర మండపం వద్ద 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించి రథాంగ పూజ, హోమం, బలిలో గుమ్మడికాయలు, కొబ్బరికాయ లు, అన్నం రాశిగా పోసి కుంభంగా సాత్విక బలి సమర్పించిన అనంతరం రథంపై స్వామి, అమ్మవారిని ఆశీనులను చేశారు. అనంతరం ఆలయ ప్రధాన వీధిలో రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకొని తన్మయత్వం చెందారు. రథోత్సవ దర్శనంతో సర్వపాపాలు తొలగి కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం.
పుష్కరిణిలో తెప్పోత్సవం..
ఉత్సవాల్లో భాగంగా భ్రామరీ మల్లికార్జునస్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీప కాంతుల మధ్య పుష్కరిణిలో తెప్పపై విహరించిన ఆది దంపతులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు తరలొచ్చారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ రాజగోపురం నుంచి పుష్కరిణికి చేరుకున్న ఉత్సవ మూర్తులకు షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. కార్యక్రమంలో ఈఈ మురళి, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు ఫణీందర్ ప్రసాద్, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్‌కుమార్, అధికారులు శ్రీహరి, నర్సింహారెడ్డి, అయ్యన్న, సిబ్బంది పాల్గొన్నారు.