మూసాపేట, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో సర్కారు వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జానంపేట పీహెచ్సీలో రూ.1.30కోట్ల నిధులతో రాష్ట్రంలోనే మొట్టమొదటి అత్యాధునిక పరిశోధనా కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ జానంపేటకు పరిశోధన కేంద్రం రావడం హర్షణీయమన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట మధు, ఐసీఎంఆర్ స్టేట్ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అనారోగ్య సమస్యలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేయడంతోపాటు వాటి నిర్మూలనకు విరుగుడు తయారు చేసేందుకు పరిశోధనా కేంద్రం దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో ఒక్కచోటనే ఈ పరిశోధన కేంద్రం ఉంటుందని, అలాంటి కేంద్రం జానంపేట పీహెచ్‌సీకి మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, డాక్టర్ శ్వేత, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, స్వరూప, భాస్కర్, ఎంపీటీసీ నక్క ఆంజనేయులు, ఉపసర్పంచ్ అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు శివరాములు, ఎండీ సత్తార్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.