సోషల్‌మీడియా ఇన్ఫ్లుయన్సర్ యామిని ఈఆర్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘క్వీన్’. రతన్ రిషి దర్శకుడు. వన్ సర్కిల్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్నది. వాలెంటైన్స్‌డే సందర్భంగా శనివారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
ఈ టైటిల్ గ్లింప్స్‌ని చూస్తే ప్రస్తుత సమాజంతో ముడిపడివున్న ఒక ఆసక్తికరమైన ప్రేమకథని చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమకథలు మిగిలిపోతాయి. తాజ్‌మహల్ వంటి గుర్తులుగా మరికొన్ని ప్రేమకథలు నిలిచిపోతాయి. కానీ ఈ ప్రేమకథ దేశపు మనుగడను మార్చే ఓ కొత్త శాసనం.. అని చెబుతూ భారత రాజ్యాంగాన్నీ, ఆర్టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివి గ్లింప్స్‌లో చూపించడం ‘క్వీన్’ సినిమాపై ఆసక్తి కలిగించింది.
తాను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తెచ్చేందుకు ఓ అమ్మాయి చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని దర్శకుడు రతన్ రిషి చెప్పారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్‌ఘోష్, భాయ్ నవీన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సరస్, సంగీతం: యతీష్.