సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారితో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిమనోహర్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాదారుల కోసం శనివా రం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక ‘డీ-ఫ్రీజ్ ఖాతాల మేళా’లో డీసీపీ పాల్గొని ఖాతాదారులకు ఎన్ఓసీలను అందజేశారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ మాట్లాడుతూ…నిజమైన ఖాతాదారుల సమస్యలను పరిషరించేందుకు, వారికి త్వరితగతిన న్యాయం చేయడం కోసమే ఈ ప్రత్యేక డీ-ఫ్రీజ్ ఖాతాల మేళాను నిర్వహించామన్నారు. ఈ మేళా సందర్భంగా నేషనల్ క్రైమ్ రికార్డ్ పోర్టల్(ఎన్సీఆర్పీ)ద్వారా ఫ్రీజ్ చేసిన 110 బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఖాతాదారుల వివరాలు, లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీ లించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిజమైన ఖాతాదారులను గుర్తించి, చట్టపర మైన విధానాలను అనుసరించి వారి ఖాతాలను డీ-ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.
ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, ఖాతాల దుర్వినియో గాన్ని నివారించేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన ఖాతాదారులకు ఉపశమనం లభించడంతో పాటు, సైబర్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో బాధితులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ ‘1930’కు కాల్ చేయడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా, మోసానికి సంబంధం ఉన్న అనుమానిత బ్యాంక్ ఖాతాలను గుర్తించి, బాధితుల డబ్బు నేరగాళ్లకు మళ్లించకుండా అనుమానిత ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంద న్నారు.
అయితే దర్యాప్తు ప్రక్రియలో భాగంగా, కొన్ని బ్యాంక్ ఖాతాలను లావాదేవీల సంబంధాల కారణంగా ముందస్తు చర్యగా ఫ్రీజ్ చేసినప్పటికీ, ఆ ఖాతాదారులు నేరుగా మోసాలకు సంబంధంలేని వ్యక్తులను గుర్తించడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేయబడిన ఖాతాదారుల ఖాతాలను డీ-ఫ్రీజ్ చేస్తూ ఎన్ఓసీలు జారీచేయడం జరిగిందని డీసీపీ తెలిపారు. కాగా పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిర్ధోషులైన ఖాతాదారులను గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలను డీ-ఫ్రీజ్ చేస్తూ ఎన్ఓసీలు జారీచేయడంపై బాధిత ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, శివప్రసాద్, దుర్గా రామలింగ ప్రసాద్, రా మిరెడ్డి, రాఘవేందర్, మధు, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.