హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ వంటి కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ -26 నోటిఫికేషన్ విడుదలైంది. జేఎన్టీయూహెచ్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఎప్‌సెట్-26 వెబ్‌సైట్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సంవత్సరం కొత్తగా రూ. 10వేల ఫీజుతో ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. 2025లో రూ. 5వేల ఫీజు వరకే పరిమితం చేశా రు.
ఇప్పుడు మాత్రం రూ. 10వేలతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. కరోనా కం టే ముందు రూ. 10వేల ఫీజు ఉండేది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరోనా సమయంలో రూ. 5వేలు, రూ. 10వేల ఫీజులను రద్దుచేశారు. రూ. 2,500 మాత్రమే చివరి ఫీజుగా ఖరారు చేశారు. నిరుటి వరకు రూ. 5వేల ఫీజు ఉండగా, ఈ సంవత్సరం పది వేల ఫీజుతో దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. రూ. 2,500, ఐదువేలు, పది వేలతో ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసిన వారికి హైదరాబాద్‌లోనే సెంటర్లు నిర్వహిస్తామని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఈ సారి నుంచి ఎప్‌సెట్ పరీక్షకు దరఖాస్తుచేసే ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఇది వరకు ఇలాంటిది ఉండేది కాదు. ఈ సారి నుంచే ప్రవేశపెడుతున్నారు. విద్యార్థి ఫీజు చెల్లింపు రసీదు నంబర్ (ట్రాన్సాక్షన్ ఐడీ), పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ఆధారంగా దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలని విజయ్‌కుమార్‌రెడ్డి సూచించారు.