కంటోన్మెంట్, ఫిబ్రవరి 14: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో 40 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యం కలిగిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం 75 వేల సంతకాలకు చేరువైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి సంతకంతో ప్రారంభమై కంటోన్మెంట్ బోర్డు వ్యాప్తంగా చేపట్టిన ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి బోర్డు పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన విద్యావేత్తలు ఆన్లైన్ ద్వారా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి మద్దతు తెలుపుతుండడం విశేషం. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్ ద్వారా 50 వేల 918 మంది స్కాన్ చేసి మద్దతు ప్రకటించారు. ఇక బస్తీల్లో వాలంటీర్లు చేపట్టిన సంతకాల సేకరణలో మహిళలు, యువకులు 23 వేల 479 మంది సంతకాలు చేసి మద్దతు పలికారు. మొత్తంగా 74 వేల 852 మంది విలీనం విషయంలో సంతకాలతో మద్దతు ప్రకటించారు.
నిబద్దతతో సంతకాల సేకరణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సరైన ఆలోచన విధానం, గమ్యం లేకుండా తన రాజకీయ లబ్ది కోసం 8 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి బిచాణా ఎత్తేసిన విధంగా కాకుండా నిబద్దతతో బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ జెండా లేకుండా వాలంటీర్లతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ వెల్లడించారు. జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా రోడ్ల అభివృద్ధి మౌళిక సదుపాయల కల్పన ఇతర అంశాల్లో కంటోన్మెంట్ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలను కాలనీల్లోని విద్యావంతులకు వివరిస్తుండడంతో వారు స్వచ్ఛందంగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు. లక్ష సంతకాల సేకరణ పూర్తయిన అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీలకు పంపుతామని తెలిపారు.